ఎంఎంటీఎస్​లో అత్యాచారయత్నం.. బయటకు దూకిన యువతి ..పగిలిన తల, విరిగిన మణికట్టు

ఎంఎంటీఎస్​లో అత్యాచారయత్నం.. బయటకు దూకిన యువతి ..పగిలిన తల, విరిగిన మణికట్టు


పద్మారావునగర్, వెలుగు: నడుస్తున్న ఎంఎంటీఎస్ ​రైల్లోని మహిళల బోగీలో ఓ యువతిపై ఆగంతకుడు అత్యాచారానికి యత్నించాడు. దీంతో ఆమె భయంతో రైలులోనుంచి బయటకుదూకేసింది. కంకర రాళ్లపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. స్పృహతప్పి పడిపోయిన బాధితురాల్ని అటువైపు వెళ్తున్న బాటసారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది.  

అసలేం జరిగింది?

ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన మహిళ (23) మేడ్చల్‌‌లోని ఉమెన్స్‌‌ హాస్టల్‌‌ లో ఉంటూ స్విగ్గీలో పని చేస్తున్నది. ఈ నెల 22న మధ్యాహ్నం మేడ్చల్​నుంచి సికింద్రాబాద్​రైల్వే స్టేషన్​సమీపంలోని ఓ సెల్​ఫోన్ ​రిపేరింగ్ ​షాపుకు తన మొబైల్​ డిస్​ప్లే మార్చుకునేందుకు వచ్చింది. మొబైల్​ రిపేర్​చేయించుకుని సుమారు రాత్రి ఏడున్నరకు ప్లాట్​ఫామ్​ నంబర్​10లో తెల్లాపూర్‌‌-–మేడ్చల్‌‌ ఎంఎంటీఎస్‌‌ రైలెక్కింది. అది మహిళల బోగీ. అప్పడు ఆ బోగీలో సదరు యువతితో పాటు మరో ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నారు. అల్వాల్‌‌‌‌‌‌‌‌లో ఆ ఇద్దరూ దిగిపోయారు. తర్వాత యువతి మాత్రమే బోగీలో ఉంది. అప్పుడే ఓ యువకుడు బోగీలోకి ఎక్కాడు. యువతిపై లైంగికదాడికి ప్రయత్నించగా.. భయంతో ఆమె రైలులోంచి గుండ్లపోచంపల్లి ఎంఎంటీఎస్​స్టేషన్​కు అర కిలోమీటర్​దూరంలో బయటకు దూకింది. కంకర రాళ్లపై పడటంతో బాధితురాలి తలకు తీవ్ర గాయాలయ్యాయి. చేతి మణికట్టు విరిగిపోయింది. మొఖం, గదవ, శరీరం నుంచి రక్తం పోతుండడంతో అటువైపు వెళ్తున్న బాటసారులు గమనించి పోలీసులకు, అంబులెన్స్​కు సమాచారం అందించారు. అక్కడి నుంచి గాంధీ దవాఖానకు తరలించారు.  కాగా, గాంధీ దవాఖానలో ట్రీట్​మెంట్ పొందుతున్న బాధిత యువతిని సోమవారం బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ప్రెసిడెంట్ డా.శిల్పారెడ్డి పరామర్శించారు.

 ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని చెప్పడానికి ఎంఎంటీఎస్​రైలులో జరిగిన ఘటనే ఒక ఉదాహరణ అని అన్నారు. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్​గౌడ్‌‌‌‌‌‌‌‌  కూడా గాంధీ హాస్పిటల్​కు వచ్చి బాధితురాలని పరామర్శించారు. రాష్ట్రంలో షీ టీమ్‌‌‌‌‌‌‌‌ పనితీరు ప్రశ్శార్థకంగా మారిందని మండిపడ్డారు. మనకు కావాల్సింది అందాల పోటీలు కాదని, మహిళలకు భద్రత అని అన్నారు.  రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని వారు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు.  ఇదిలా ఉంటే.. బాధితురాలిని సమీపంలోని ఓ ప్రైవేట్​ హస్పిటల్​కు షిఫ్ట్​ చేశారు.

వచ్చినప్పుడు స్పృహలో లేదు

రైలు నుంచి కిందపడి గాయపడిన బాధిత యువతి 22న రాత్రి 11.30 గంటలకు ఎమర్జెన్సీ వార్డులో చేరిందని - ---
గాంధీ డిప్యూటీ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ సునీల్‌‌‌‌‌‌‌‌ కుమార్ తెలిపారు. ఆమెకు మెరుగైన వైద్యసేవలందించామన్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడిందని తెలిపారు. వచ్చినప్పుడు స్పృహలో ఉన్నప్పటికీ మతిస్థిమితం కోల్పోయినట్లు కనిపించిందని వివరించారు. హ్యాండ్​రిస్ట్‌‌‌‌‌‌‌‌ విరిగి, శరీరంపై మాన్యువల్, మొఖంపై సాఫ్ట్‌‌‌‌‌‌‌‌ ఇంజ్యూరీలు ఉన్నాయన్నారు. న్యూరోసర్జరీ ట్రామా(ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌) డిపార్ట్​మెంట్​లో డాక్టర్లు, ఆర్థోపెడిక్, ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌సర్జరీ డాక్టర్లు ట్రీట్​మెంట్​చేశారని తెలిపారు. 

నిందితుడి కోసం గాలిస్తున్నాం

గాంధీ హాస్పిటల్​ వెళ్లి బాధిత యువతిని పరామర్శించాను. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నాను. నిందితుడి కోసం 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాం. రెండు బృందాలు సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలిస్తున్నాయి. టెక్నికల్ ​ఎవిడెన్స్ సేకరిస్తున్నాం.  స్టేట్​మెంట్​రికార్డు చేశాం. నిందితుడిని గుర్తించడంలో పురోగతి సాధించాం. త్వరలోనే పట్టుకుంటాం. నిందితుడి వయసు 25 ఏండ్ల ఉండొచ్చు. చెక్స్​షర్ట్​, షార్ట్ వేసుకుని ఉన్నాడని బాధితురాలు పోలీసుల దృష్టికి తెచ్చింది. యువతికి ప్రాణాపాయం లేదు. 
- ఎస్పీ చందనా దీప్తి, గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ రైల్వే పోలీస్‌‌‌‌‌‌‌‌ (జీఆర్‌‌‌‌‌‌‌‌పీ)