మ్యూజియంలో తన గుండెను చూసి మైమరచిపోయిన మహిళ

మ్యూజియంలో తన గుండెను చూసి మైమరచిపోయిన మహిళ

సాధారణంగా చాలా మంది మ్యూజియానికి వెళ్తే  చారిత్రాత్మక విషయాలను తెలుసుకోవడానికి, వింతైన, ఆశ్చర్యకరమైన వస్తువులను చూడటానికి వెళతారు. కానీ జెన్నిఫర్ సుట్టన్ మాత్రం అందరికీ వ్యతిరేకంగా ఉంది. హాంప్‌షైర్‌లోని రింగ్‌వుడ్‌లో నివసిస్తున్న ఈ యువతి తన హృదయాన్ని చూసేందుకు కొద్ది రోజుల క్రితం మ్యూజియంకు వెళ్లింది. ఆమె గుండె లండన్‌లోని హంటేరియన్ మ్యూజియంలో భద్రపరచబడింది. దీన్ని చూసిన జెన్నిఫర్ తన అనుభవాన్ని పంచుకున్నారు. దాన్ని చూడగానే అది తన శరీరం లోపల ఉండి కొట్టుకుంటున్నట్లు అనిపించిందని, అది తనతో 22 సంవత్సరాలు జీవించిందని, అందుకు తాను గర్విస్తున్నానని తెలిపారు.

నిజానికి, జెన్నిఫర్ ఈ రోజు జీవించి ఉందంటే అది అవయవ దానం వల్లనే. ఆమె దానిని ప్రపంచంలోనే అత్యుత్తమ బహుమతిగా పేర్కొంది. ఆమె గుండె పనిచేయకపోవడంతో గుండె మార్పిడి చేయాల్సి వచ్చింది. మరణానంతరం ఒక వ్యక్తి గుండె అమెకు వైద్యులు మార్పిడి చేశారు. ఇప్పుడు ఆమె పూర్తిగా ఆరోగ్యంగా, చురుకుగా ఉంది. ప్రజలకు కూడా సహాయం చేస్తోంది.

22 ఏళ్ల జెన్నిఫర్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు, ఆమె తన శరీరంలో వచ్చే మార్పులను గుర్తించింది. మెట్లు ఎక్కడానికి కష్టపడడం, శరీరం వణుకడం వల్ల ఆమె వేగంగా నడవలేకపోయింది. చెమట తక్కువగా ఉన్న సమయంలోనూ ఆమెకు చెమటగా మారేది. కాలు వాచిపోయి, కడుపు ఉబ్బరంగా ఉండడంతో.. డాక్టర్లకు చూపించగా.. కార్డియోమయోపతికి గురైనట్లు తేలింది. గుండె శరీరానికి రక్తాన్ని సరిగ్గా పంప్ చేయకపోవడంతో ఈ వ్యాధి సంభవిస్తుంది. కొన్నిసార్లు ఇది గుండెపోటుకు కారణం అవుతుంది.

ట్రాన్స్‌ప్లాంట్ చేయకపోతే కాపాడటం కష్టం

దీనికి గుండె మార్పిడి ఒక్కటే చికిత్స ఉందని వైద్యులు తెలిపారు. మార్పిడి త్వరగా చేయకపోతే, ఆమెను రక్షించడం కష్టమన్నారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత 2007లో ఓ దాత దొరికాడు. అలా ఇప్పుడు ఆమె చాలా ఆరోగ్యకరమైన వ్యక్తిలా జీవిస్తోంది. ఆ తర్వాత ఆమె చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. జెన్నిఫర్ తన హృదయాన్ని మ్యూజియంలో భద్రపరచాలని అనుకున్నారు. శస్త్రచికిత్స తర్వాత ఆమె రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్‌కు అనుమతి ఇచ్చింది. అలా ఆమె హృదయం హోల్బోర్న్ మ్యూజియంలో ప్రజలకు ప్రదర్శించబడింది. దీని ద్వారా అవయవదానం చేసిన వ్యక్తి గురించి ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటోంది.