
హైదరాబాద్, వెలుగు:
హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు ఓ మహిళ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే స్పందించిన పోలీసులు మంటలార్పి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఏసీపీ తిరుపతన్న వివరాల ప్రకారం… చెన్నైకి చెందిన లోకేశ్వరి(45)ని 2000 సంవత్సరంలో శ్రీనివాస్ అనే వ్యక్తి పెళ్లి చేసుకుని పాప పుట్టగానే వదిలేశాడు. తర్వాత మహబూబ్‌నగర్‌కు చెందిన ప్రవీణ్‌తో తిరుపతిలో ఆమెకు పరిచయం ఏర్పడింది. లోకేశ్వరిని ప్రవీణ్ హైదరాబాద్ తీసుకువచ్చి సోమాజిగూడ మక్తలో అద్దెకు ఉంచాడు. ప్రవీణ్ జ్యువెలరీ షాప్‌లో ఆమెను మేనేజర్‌గా నియమించాడు. అయితే 2013లో లోకేశ్వరి 21 తులాల బంగారం చోరీ చేసిందని పంజాగుట్ట పోలీసులకు ప్రవీణ్ ఫిర్యాదు చేయడంతో ఆమెను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్ చేశారు. అప్పటి నుంచి ప్రవీణ్, లోకేశ్వరి మధ్య వివాదం కొనసాగుతోంది.
చైన్నైలో ఉంటున్న లోకేశ్వరి ప్రవీణ్‌ను కలిసేందుకు కన్నన్ అనే వ్యక్తితో కలసి శుక్రవారం హైదరాబాద్ వచ్చింది. నాంపల్లిలోని లాడ్జిలో దిగింది. మంగళవారం సాయంత్రం 5.30 గంటల టైంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిసరాల్లో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు మంటలార్పి ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. లోకేశ్వరికి 70 శాతం కాలిన గాయాలైనట్టు తెలుస్తోంది.