అంత్యక్రియలకు వెళ్తుండగా ట్రాక్టర్​ బోల్తా మహిళ మృతి.. 15 మందికి గాయాలు

అంత్యక్రియలకు వెళ్తుండగా ట్రాక్టర్​ బోల్తా మహిళ మృతి.. 15 మందికి గాయాలు
  • మరో ఐదు ప్రమాదాల్లో నలుగురు మృతి
  • 11 మందికి తీవ్ర గాయాలు.. ఒకరికి సీరియస్​

కొడంగల్/గండిపేట/మెహిదీపట్నం, వెలుగు: వికారాబాద్ జిల్లా ఈర్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. బంధువు అంత్యక్రియలకు వెళ్తుండగా ట్రాక్టర్​బోల్తా పడి ఓ మహిళ మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. దౌల్తాబాద్​ఎస్సై రవిగౌడ్​తెలిపిన వివరాల ప్రకారం.. నాగసర్​లోని బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సోమవారం ఉదయం ఈర్లపల్లికి చెందిన 30 మంది ట్రాక్టర్​లో బయలుదేరారు. దారిలోని దేవరఫసల్వాద్ గ్రామ శివారులో ట్రాక్టర్​అదుపు తప్పి పక్కనున్న కంది చేనులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అమృతమ్మ(53) అనే మహిళ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోయింది. 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కొడంగల్​ఆసుపత్రికి తరలించారు.

కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అలాగే వికారాబాద్ జిల్లా బోంరాస్​పేట కారు టైరు పేలి ఓ ప్రైవేట్​ఉద్యోగి చనిపోయాడు. విశ్వనాథ్​వెంకట రమణయ్య(49) కర్ణాటక బార్డర్​మల్కెడ్ లోని అల్ట్రాటెక్​ సిమెంట్ ​కంపెనీలో సెక్షన్​హెడ్​గా చేస్తున్నాడు. ఆదివారం రాత్రి కారులో హైదరాబాద్​నుంచి మల్కెడ్ బయలుదేరాడు. దారిలో కారు టైరు పేలి ఎదురుగా వచ్చిన లారీని ఢీకొట్టింది. రమణయ్య అక్కడిక్కడే చనిపోయాడు. కారులోని మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని బోంరాస్​పేట ఎస్సై రావుఫ్​ తెలిపారు. 

కార్లు అదుపు తప్పి ఇద్దరు మృతి

హిమాయత్‌సాగర్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై సోమవారం ఓ కారు అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టింది. తర్వాత రోడ్డు పక్కనున్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. కారులోని ఎల్​వీప్రసాద్​హాస్పిటల్​లో నిలయారెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. అలాగే ఆఫీస్ ​క్యాబ్​అదుపు మాసబ్​ట్యాంక్​లో ఓ సాఫ్ట్​వేర్ ఉద్యోగి చనిపోయాడు. ఇన్​స్పెక్టర్ అప్పలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న సాయితేజ, సాయి సుధ, సందీప్, మాధురి, సాయి కృష్ణ సోమవారం ఉదయం క్యాబ్​లో హయత్​నగర్​నుంచి ఆఫీసుకు బయలుదేరారు. మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ ఎక్కుతున్న టైంలో ముందు వెళ్తున్న బైకును ఓవర్​టేక్ ​చేయబోయగా కారు అదుపు తప్పి డివైడర్​ను ఢీకొంది. ముందు సీటులో కూర్చున్న సాయితేజ(25) అక్కడికి అక్కడే మృతి, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్యాబ్ డ్రైవర్ సాయి వంశీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సీఐ తెలిపారు.

పీవీఎన్ఆర్ ఎక్స్​ప్రెస్​వేపై కారు బీభత్సం

శంషాబాద్ నుంచి మెహిదీపట్నం వెళ్తున్న ఓ కారు పీవీఎన్ఆర్ ఎక్స్​ప్రెస్ వే పై పిల్లర్​నంబర్​285 వద్ద అదుపు తప్పి డివైడర్​ను ఢీకొట్టింది. కారులోని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. 

వర్షానికి రోడ్డు కనబడక కారు బోల్తా.. మహిళ మృతి

శామీర్ పేట: శామీర్​పేట వద్ద వర్షానికి రోడ్డు కనబడక ఓ కారు బోల్తా పడింది. భూపాలపల్లి జిల్లా బొమ్మాపూర్​కు చెందిన మనోహర్ రెడ్డి సోమవారం కారులో తల్లి పుష్పలత(48), అక్క రస్మిత, ఆమె కూతురు రియాన్షితో కలిసి సిటీలోని నిజాంపేటకు వస్తున్నారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నం.7కి దగ్గర్లోకి రాగానే భారీ వర్షానికి రోడ్డు కనిపించలేదు.

కారు అదుపు తప్పి డివైడర్​ను ఢీకొని బోల్తా పడింది. పుష్పలత తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే చనిపోయింది. రస్మిత, ఆమె కూతురు రియాన్షికి స్వల్ప గాయాలయ్యాయి. శామీర్ పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.