హైదరాబాద్: కుటుంబ కలహాలతో వివాహిత తన కుమార్తెతో కలిసి హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పాత బస్తీలో నివాసముంటూ పృథ్వీ లాల్ వ్యాపారం చేస్తున్నాడు. అతని భార్య కీర్తిక అగర్వాల్ చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తుంది. వీరికి రెండేళ్ల కుమార్తె బియ్యారా ఉంది. దంపతుల మధ్య గొడవలతో ఆమె ఏడాదిన్నర కిందటే బహదూర్ పురలో నివాసముంటున్న తల్లిదండ్రుల దగ్గరే కుమార్తెతో కలిసి ఉంటోంది. నవంబర్ 2న ట్యాంక్ బండ్ దగ్గర హుస్సేన్ సాగర్ లో పాపతో కలిసి దూకి కీర్తిక ఆత్మహత్యకు పాల్పడింది.
నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్ సమీపంలో ఆమె మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాలు లభ్యం కాకపోవడంతో పోలీసులు మార్చురీకి తరలించారు. తమ కుమార్తె, మనుమరాలు కనిపించడం లేదని కీర్తిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడిన మహిళనే కీర్తిక అగర్వాల్గా లేక్ పోలీసులు గుర్తించారు. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
చనిపోయింది తమ కూతురేనని కీర్తిక అగర్వాల్ తల్లిదండ్రులు నిర్ధారించారు. మంగళవారం పాప మృతదేహాన్ని కూడా పోలీసులు గుర్తించారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా రెండు నిండు ప్రాణాలు హుస్సేన్ సాగర్ సాక్షిగా అర్ధాంతరంగా తనువు చాలించిన ఘటన కీర్తిక కుటుంబంలో పెను విషాదం నింపింది.
