Women's ODI World Cup: ఐసీసీ చారిత్రాత్మక నిర్ణయం.. వన్డే వరల్డ్ కప్‌లో తొలిసారి అందరూ మహిళా అధికారులే

Women's ODI World Cup: ఐసీసీ చారిత్రాత్మక నిర్ణయం.. వన్డే వరల్డ్ కప్‌లో తొలిసారి అందరూ మహిళా అధికారులే

మహిళా క్రికెట్ లో ఐసీసీ ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ఇండియా, శ్రీలంక వేదికలుగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ కు గురువారం (సెప్టెంబర్ 11) పూర్తిగా మహిళా అధికారులతో కూడిన జాబితాను ప్రకటించింది. టోర్నమెంట్ చరిత్రలో మహిళల వన్డే ప్రపంచ కప్‌ను పూర్తిగా మహిళలే నిర్వహించడం ఇదే తొలిసారి. దీని ప్రకారం మహిళల ప్రపంచ కప్ 2025లో అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు, థర్డ్ అంపైర్ ఇలా మొత్తం మ్యాచ్ ను మహిళలే నిర్వహిస్తారు. 

2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడలు.. చివరిసారిగా జరిగిన రెండు ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ తర్వాత పూర్తిగా మహిళా మ్యాచ్ అధికారుల ప్యానెల్‌ను కలిగి ఉన్న నాల్గవ ప్రపంచ టోర్నమెంట్ ఇది. అంపైరింగ్ ప్యానెల్‌లో భారత మాజీ క్రీడాకారిణులు బృందా రతి, ఎన్ జనని, గాయత్రి వేణుగోపాలన్ ఉన్నారు. అనుభవజ్ఞులైన అంపైర్లు క్లైర్ పోలోసాక్, జాక్వెలిన్ విలియమ్స్, స్యూ రెడ్‌ ఫెర్న్ ముగ్గురూ కూడా మూడోసారి ఐసీసీ ఈవెంట్ లో అంపైర్లుగా చేయనున్నారు.

"మొత్తం మహిళా మ్యాచ్ అధికారుల ప్యానెల్‌ను చేర్చడం ఒక ప్రధాన మైలురాయి మాత్రమే కాదు.. క్రికెట్ అంతటా లింగ సమానత్వాన్ని పెంపొందించడానికి ఐసీసీ తీసుకొస్తున్న చారిత్రాత్మక మార్పు". అని ఐసీసీ చైర్మన్ జై షా అన్నారు. 13వ ఎడిషన్ మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో 33 రోజుల పాటు మొత్తం 31 మ్యాచ్‌లు జరుగుతాయి. 8 జట్లు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మ్యాచ్ లు ఆడతాయి. టాప్-4 లో నిలిచిన జట్లు సెమీస్ కు చేరతాయి. 

 మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీ 2025, సెప్టెంబర్ 30 నుంచి 2025 నవంబర్ 2 వరకు జరగనుంది. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ .. ఈ జట్లు వరల్డ్ కప్ కోసం పోటీ పడనున్నాయి. ఆస్ట్రేలియా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. సొంత దేశంలో టోర్నీ కావడంతో భారత్ హాట్ ఫేవరెట్. భారత్ చివరగా 2013లో ప్రపంచ్ కప్‎కు ఆతిథ్యం ఇవ్వగా.. ఈ టోర్నీలో ఇండియా ఉమెన్స్ టీమ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.    

ఐసిసి మ్యాచ్ అధికారుల ప్యానెల్:

మ్యాచ్ రిఫరీలు: ట్రూడీ ఆండర్సన్, షాండ్రే ఫ్రిట్జ్, GS లక్ష్మి, మిచెల్ పెరీరా.

అంపైర్లు

లారెన్ అగెన్‌బాగ్, కాండేస్ లా బోర్డే, కిమ్ కాటన్, సారా దంబనేవానా, షాతీరా జాకీర్ జెస్సీ, కెర్రిన్ క్లాస్టే, జననీ ఎన్, నిమాలి పెరెరా, క్లైర్ పోలోసాక్, బృందా రాఠీ, స్యూ రెడ్‌ఫెర్న్, ఎలోయిస్ షెరిడాన్, గాయత్రి వేణుగోపాలన్, జాక్వెలైన్స్.