మద్యం దుకాణం ఎదుట ఆందోళన : మహిళల అరెస్టు

మద్యం దుకాణం ఎదుట ఆందోళన : మహిళల అరెస్టు
  • వైన్ షాపును ఓపెన్  చేయించిన పోలీసులు

కమలాపూర్, వెలుగు : హనుమకొండ జిల్లా కమలాపూర్  మండలంలోని అంబాల గ్రామంలో  ప్రధాన రహదారిపై ఉన్న వైన్ షాపును మార్చాలని రెండు రోజులుగా ఆందోళన చేస్తున్న మహిళలను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం దుకాణం మార్చాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మందుబాబులతో మహిళలకు ఇబ్బంది కలుగుతున్నదని, షాప్  పరిసర ప్రాంతాల్లో మూత్రవిసర్జన చేయడంతో దుర్వాసన వస్తోందని వాపోయారు. వారం రోజుల క్రితం ధర్నా చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి  చేరుకుని నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను, వారికి మద్దతు తెలిపిన పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ సీఐ గాదె రమ్య కాలనీ మహిళల సమస్యలు తెలుసుకున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. వైన్ షాప్  వద్ద సెక్యూరిటీ పెట్టి మహిళలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పోలీసులు ఆ వైన్ షాప్ ను ఓపెన్  చేయించారు.