ఆడోళ్లు చక్కెర ఎక్కువ తింటున్రు…

ఆడోళ్లు చక్కెర ఎక్కువ తింటున్రు…

    రోజుకు 30 గ్రాముల చక్కెర పదార్థాలు తినాలె

    మహిళలు 20.2 గ్రా., పురుషులు 18.7 గ్రా. తింటున్రు

    హైదరాబాద్​లోనే తక్కువ

   మెట్రో సిటీల్లో ఎన్ఐఎన్, ఐసీఎమ్ఆర్ సర్వే

హైదరాబాద్, వెలుగు: ఆడోళ్లు చక్కెర ఎక్కువ తింటున్నరట. తినే ఆహారంలో భాగంగా మగాళ్ల కంటే 2 శాతం ఎక్కువగా చక్కెర పదార్థాలను తీసుకుంటున్నరట. దేశవ్యాప్తంగా మెట్రో సిటీల్లో నివసించే మహిళలు రోజూ సగటున 20.2 గ్రాముల చక్కెర పదార్థాలు తీసుకుంటుండగా, పురుషులు 18.7 గ్రాముల వరకు తీసుకుంటున్నారట. సగటున రోజూ ప్రతి ఒక్కరూ 19.5 గ్రాముల చొప్పున షుగర్ తింటున్నరట. నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌‌ (ఎన్ఐఎన్), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఇవి వెల్లడయ్యాయి.

ఫస్ట్ ప్లేస్​లో ముంబై

ఐసీఎమ్ఆర్ ప్రకారం రోజూ తినే ఆహార పదార్థాల్లో 30 గ్రాముల వరకు షుగర్ ఉండాలి. కానీ ఒక్క మెట్రో సిటీలో కూడా ఆ స్థాయిలో ఎవరూ తినడం లేదు. రెండు సిటీలు మినహా ఇంకే నగరంలోనూ 25 గ్రాములపైన చక్కెర పదార్థాలను వినియోగించడం లేదు. ఇక ఏడు మెట్రో సిటీల్లో కూడా అమ్మాయిలే అత్యధికంగా తీసుకుంటున్నారు. రోజూ ముంబై సిటిజన్స్ సగటున 26.2 గ్రాముల చక్కెరను ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. ఇందులో మహిళలు 28 గ్రాములు, పురుషులు 24.4 గ్రాములు తింటున్నారు. అహ్మదాబాద్‌లో 25.9, ఢిల్లీలో 23.2, బెంగళూరులో 19.3, కోల్​కతాలో17.1, చెన్నైలో 16.1, హైదరాబాద్​లో 15.5 గ్రాముల షుగర్ తీసుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది.

5,127 మందిపై స్టడీ

దేశంలోని ఏడు మెట్రో సిటీల్లో నివసించే 5,127 మందిపై స్టడీ చేశారు. వారు రోజూ తినే ఆహార పదార్థాల వివరాలను ఎన్ఐఎన్ పరిశీలించింది. పిల్లలు, వృద్ధుల కంటే అమ్మాయిలే ఎక్కువ తీసుకుంటున్నట్లు గుర్తించింది. స్కూలు పిల్లలు రోజూ తీసుకునే ఆహారంలో సగటున 15.6 నుంచి 17.6 గ్రాముల షుగర్ ఉంటుండగా, 18–35 వయసు వారు 19.9 గ్రాములు, 36–59 వయసు వారు 20.5 గ్రాములు, 60 ఏళ్లకుపై బడిన వారు 20.3 గ్రాములు వరకు షుగర్ తీసుకుంటున్నట్లు తేలింది.

అమ్మాయిల్లోనే ఎందుకు ఎక్కువ?

సాధారణంగా పురుషులు ఎక్కువ తింటారు. అమ్మాయిలు తక్కువ తినేందుకు ఆసక్తి చూపుతారు. అయితే గృహిణులకు ఇష్టమైన తిండి తయారు చేసుకునేందుకు వెసులుబాటు ఎక్కువగా ఉండటం వల్ల తియ్యటి పదార్థాలను ఎక్కువగా తింటున్నారని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. చాలా మంది టీనేజర్లు, ఉద్యోగం చేసే మహిళలు ఎక్కువగా జంక్​ఫుడ్, చాయ్, పాలు, రైస్, స్వీట్స్, బేకరీ ఐటమ్స్, పాస్తా, వైట్ బ్రెడ్ తదితరాలను ఎక్కువగా తీసుకుంటున్నారు. దీంతో వారు తింటున్న ఫుడ్​లో షుగర్ శాతం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

వెలుగు మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి