- ఆగ్రహంతో ఇంట్లో సామగ్రిని ధ్వంసం చేసిన స్థానికులు
- మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెంలో ఘటన
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: అదనపు కట్నం కోసం కోడలిని కొట్టి చంపి, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించి అత్తింటివారు పరారయ్యారు. స్థానికులు, మృతురాలి బంధువుల కథనం మేరకు.. మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన అర్జున్, కౌసల్య దంపతుల కూతురు స్వప్న అదే గ్రామానికి చెందిన రామన్న ప్రేమించుకున్నారు. వారి ప్రేమను అంగీకరించిన15 ఏండ్ల కింద రూ.3 లక్షల కట్నం ఇచ్చి పెండ్లి జరిపించారు.
పెళ్లి జరిగిన ఏడాది నుంచి అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తుండడంతో పలుసార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. అదనపు కట్నం కింద ఎకరం భూమి ఇవ్వగా, ఆ తరువాత కూడా వేధింపులు కొనసాగాయి. ఇటీవల మళ్లీ వేధింపులకు గురి చేస్తూ ఒక రూమ్ లో బంధించి, వండు కొని తినాలని చెప్పారు. 3 రోజులుగా ఒక్కతే వండుకుని తింటోంది. ఈ విషయాన్ని తల్లికి చెప్పి రోధించింది.
ఈక్రమంలో ఆదివారం స్వప్నను కొట్టి చంపేసిన అత్తింటివారు పురుగుల మందు తాగి పడిపోయిందని సమాచారం ఇచ్చి పరారయ్యారు. అక్కడికి చేరుకున్న స్వప్న కుటుంబ సభ్యులు, స్థానికులు డెడ్‌బాడీపై గాయాలు ఉండడం చూసి హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నారని ఆగ్రహానికి గురయ్యారు. ఇంట్లోని సామగ్రిని ధ్వంసం చేశారు. స్వప్నను హత్య చేసిన అత్త బుజ్జి, మామ కిషన్, భర్త రామన్న, మరిది నవీన్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు.
