మహిళా పోలీసుల కోసం ప్రత్యేక రక్షణ కవచం

మహిళా పోలీసుల కోసం ప్రత్యేక రక్షణ కవచం

ఢిల్లీ: పోలీస్ విభాగంలో పనిచేస్తున్న మహిళా పోలీసుల కోసం త్వరలోనే ఫుల్ బాడీ ప్రొటెక్టర్స్ గా పిలబడే రక్షణ కవచాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇంత వరకు మహిళా పోలీసులు.. మగ వారి కోసం తయారు చేసిన గేర్ (రక్షణ కవచం)ను మాత్రమే వాడేవారు. మహిళల కోసం తయారుచేస్తున్న ఈ గేర్ అందుబాటులోకి వస్తే మహిళా పోలీసులు తమ విధులను చాలా సులభంగా నిర్వహించగలుగుతారని ఢిల్లీ పోలీస్ ట్రైనింగ్ స్కూల్ ఇంచార్జ్, సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

పురుషుల గేర్ ను ధరించటం వల్ల తాము విధులు సరిగా నిర్వహించలేకపోతున్నామని చాలా మంది మహిళా పోలీసులు  అంటున్నారు. పురుష పోలీసుల కోసం తయారుచేసిన ఈ గేర్లు.. మహిళలకు ఎంతమాత్రం సరిపోవు. అందుకే మహిళల కోసం ప్రత్యేకమైన రక్షణ కవచాలను తయారుచేయాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉందని ఓ ఐపీఎస్ ఆఫీసర్ తెలిపారు. మేల్ పోలీస్ ఆఫీసర్స్ తో పోలిస్తే మహిళా అధికారులు చాలా కష్టపడాల్సి వచ్చేది, కొత్తగా రాబోతున్న ఈ గేర్‌ తో తమ పోరాటత్వం పెరుగుతుందని కశ్మీర్‌ కు చెందిన ఒక మహిళా సిఆర్‌పిఎఫ్ అధికారి అన్నారు.

మహిళా పోలీసుల కోసం తయారు చేస్తున్న ఈ పూర్తి శరీర కవచంలో భుజం ప్యాడ్లు, ఆర్మ్ గార్డులు, ముందు- వెనుక కవచాలు ఉన్నాయి. అంతకుముందు వాడుతున్న పురుష బాడీ గేర్ మహిళా సిబ్బందికి సరిపోయేది కాదు మరియు వారికి కావలసిన రక్షణను కూడా అందించలేకపోయేది. కొత్తగా వస్తున్న మహిళా రక్షణ కవచాల వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందనీ … వారి విధిని చాలా సులభంగా చేయగలుగుతారని మరో పోలీస్ అధికారి అన్నారు.

DIPAS మరియు DRDO లతో కలిసి సీఆర్పీఎఫ్ ఈ గేర్ ను తయారుచేయడానికి రెండు సంవత్సరాలు పట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక బాడీ గేర్ రూపకల్పన కోసం రాపిడ్ యాక్షన్ ఫోర్స్ లోని మహిళా జవాన్లను ఆయా సంస్థల శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. డైరెక్టర్ జనరల్ లైఫ్ సైన్సెస్ ఎ.కె. సింగ్, DIPAS డైరెక్టర్ భువనేష్ కుమార్, DRDO శాస్త్రవేత్తలు మరియు సీఆర్పీఎఫ్ సీనియర్ ఆఫీసర్ల సమక్షంలో ఈ బాడీ గేర్‌ ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ సీఆర్పీఎఫ్ రాజీవ్ రాయ్ భట్నాగర్ ఆవిష్కరించారు.