న్యూఢిల్లీ: మహిళా ఇన్వెస్టర్లు బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. షేర్ మార్కెట్‌లో అనిశ్చితి పెరగడంతో కిందటి ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో వీరి పెట్టుబడులు భారీగా పెరిగాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ (యాంఫీ)– క్రిసిల్ రిపోర్ట్ ప్రకారం, మహిళా ఇన్వెస్టర్ల పాసివ్ ఫండ్ (ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు వంటివి) పెట్టుబడుల్లో గోల్డ్ ఈటీఎఫ్ల వాటా 16.4శాతానికి చేరింది.
మార్చి, 2025లో నమోదైన 6.4 శాతం నుంచి భారీగా పెరిగింది. మరోవైపు ఇండెక్స్ ఫండ్స్ వాటా 68 శాతం నుంచి 51.1 శాతానికి పడిపోయింది. అంటే ఇండెక్స్ ఫండ్స్‌లోని తమ వాటాలను తగ్గించుకుంటుండగా, గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెంచారని అర్థం.
మొత్తం రిటైల్ ఇన్వెస్టర్ల పరంగా చూస్తే, మ్యూచువల్ ఫండ్స్ నిర్వహిస్తున్న అసెట్స్ (ఏయూఎం) లో గోల్డ్ ఈటీఎఫ్ల వాటా 2020–21లోని 4.6 శాతం నుంచి 2025–26 నాటికి మూడింతలకు పైగా పెరిగి 14.9 శాతానికి చేరింది. కిందటి ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే నికరంగా రూ.69 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు ఐదేళ్లలో వచ్చిన మొత్తం పెట్టుబడుల (రూ.30,213 కోట్లు) కంటే ఇది రెండింతలు ఎక్కువ కావడం విశేషం.
ఫండ్స్‌లో మహిళల పెట్టుబడులు రూ.15.88 లక్షల కోట్లు
సిల్వర్ ఈటీఎఫ్‌లలో కూడా మహిళా ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఇండస్ట్రియల్ డిమాండ్, సప్లయ్ తక్కువగా ఉండడంతో వెండి ధరలు ఈ మధ్య కాలలో విపరీతంగా పెరిగాయి. దీంతో గోల్డ్‌తో పాటే సిల్వర్ ఈటీఎఫ్‌లలోకి కూడా ఇన్‌ఫ్లోలు పుంజకున్నాయి. సిల్వర్ ఈటీఎఫ్ ఆస్తుల విలువ మార్చి 2025తో పోలిస్తే 4.2 రెట్లు పెరిగింది. ఇతర ఈటీఎఫ్‌ల విభాగంలోకి వచ్చిన మొత్తం నికర పెట్టుబడుల్లో ఈ విభాగం వాటా దాదాపు 27 శాతంగా నమోదైంది.
గోల్డ్, సిల్వర్ ఫండ్లు అత్యవసర లిక్విడిటీని అందించడంతో పాటు రిస్క్ నిర్వహణకు, పోర్ట్‌ఫోలియో డైవిర్సిఫికేషన్‌కు కీలక హెడ్జింగ్ సాధనాలుగా మారాయని యాంఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ నాగేశ్వర్ చలసాని పేర్కొన్నారు. అంతర్జాతీయ అనిశ్చితి నేపథ్యంలో 2025–26లో ఈక్విటీ ఈటీఎఫ్‌ల కంటే బంగారం, వెండి ఈటీఎఫ్‌ల్లోకే ఎక్కువ నిధులు వచ్చాయని క్రిసిల్ ఇంటెలిజెన్స్ ప్రెసిడెంట్ ప్రీతి అరోరా తెలిపారు.
మొత్తం గోల్డ్ ఈటీఎఫ్ అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం) ఈ ఏడాది మార్చి నాటికి రూ.1.71 లక్షల కోట్లకు చేరి, ఐదేళ్లలో 64.7 శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేసిందని తెలిపారు. కాగా, మహిళల మొత్తం మ్యూచువల్ ఫండ్ ఏయూఎం విలువ గడచిన ఐదేళ్లలో భారీగా వృద్ధి చెందింది. మార్చి 2021లో రూ.5.84 లక్షల కోట్లుగా ఉన్న వీరి పెట్టుబడులు, మార్చి 2026 నాటికి రూ.10.04 లక్షల కోట్లు పెరిగి ఏకంగా రూ.15.88 లక్షల కోట్లకు చేరాయి.
