
- 2020లో 25 మంది.. ప్రస్తుత(2024) బ్యాచ్‌లో 62 మంది
- ఎన్‌పీఏలో శిక్షణ పూర్తి చేసుకున్న కొత్త ఐపీఎస్‌లు
- తెలంగాణకు ఇద్దరు మహిళా ఐపీఎస్‌ల కేటాయింపు
హైదరాబాద్, వెలుగు: ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్)లో మహిళా అధికారుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. నాలుగేండ్ల క్రితం మహిళా ఐపీఎస్ ల సంఖ్య 20 శాతం ఉండగా ప్రస్తుతం 36 శాతానికి చేరింది. ఈ మేరకు హైదరాబాద్ శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో 77వ బ్యాచ్ రెగ్యులర్ రిక్రూటీస్(2024 బ్యాచ్)లో 62 మంది మహిళా ఐపీఎస్‌లు సహా నేపాల్, భూటాన్, మాల్దీవులకు చెందిన మరో ముగ్గురు మహిళా ఆఫీసర్లు శిక్షణ పూర్తి చేసుకున్నారు.
ఇందులో మధ్యప్రదేశ్‌కు చెందిన అయేషా ఫాతిమా, రాజస్తాన్‌కు చెందిన మనీషా నెహ్రాను అకాడమీ అధికారులు తెలంగాణ కేడర్‌కు కేటాయించారు. వీరందరికీ శుక్రవారం పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ట్రైనీ ఐపీఎస్‌లు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ కేడర్‌కు కేటాయించిన ఇద్దరు ఐపీఎస్‌లు తమ ట్రైనింగ్ వివరాలను వెల్లడించారు.
అకాడమీలో ఇండోర్, అవుట్ డోర్ శిక్షణలో ప్రజా సంబంధాల గురించి తెలుసుకున్నామని చెప్పారు. హైదరాబాద్ సిటీలో కాస్మోపాలిటన్ కల్చర్ ఉందని, ఇక్కడి జనం అందరినీ కలుపుకుపోతారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మహిళా భద్రత, శాంతిభద్రతలు, నేరాల నియంత్రణ బాగుందని అభిప్రాయపడ్డారు. ఇది అత్యంత నివాస యోగ్యవంతమైన సిటీగా పేరు పొందిందన్నారు. పోలీస్ స్టేషన్లను విజిట్ చేసినప్పుడు స్థానిక ఆఫీసర్లు, ప్రజలతో కలిసి పని చేశామని తెలిపారు. గణేశ్ ఉత్సవాలు, ఇతర పండుగల బందోబస్తులో క్షేత్ర స్థాయి పోలీసింగ్ నేర్చుకున్నామని వెల్లడించారు.
ప్రజలకు అవసరమైన సేవలు చేస్తా
మాది రాజస్తాన్. ట్రైనింగ్‌లో తెలంగాణ ప్రజలతో కలిసిపోయాను. హైదరాబాద్ దేశంలోనే సేఫెస్ట్ ప్లేస్. పోలీసులకు ప్రజల నుంచి మంచి సహకారం ఉంటుంది. ఎలాంటి తారతమ్యాలు లేకుండా అన్ని కులాలు, మతాల వారు కలిసి ఉంటారు. శాంతి భద్రతలకు ఇబ్బందుల్లేవు. నేను ప్రజలకు అవసరమైన సేవలు చేస్తా. - మనీషా నెహ్రా, ఐపీఎస్, తెలంగాణ కేడర్
నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తా
హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ. ఎవరైనా సరే ఇక్కడ ప్రశాంతంగా జీవించవచ్చు. లా అండ్ ఆర్డర్ పటిష్టంగా అమలవుతోంది. హైదరాబాద్ అత్యంత నివాసవంతమైన సిటీ. ఇండోర్, అవుట్‌డోర్ ట్రైనింగ్‌లో ప్రజలతో కలిసి పనిచేశాం. పోలీసు లంటే ప్రజల్లో గౌరవాన్ని గుర్తించాం. నేను నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తా. అయేషా ఫాతిమా, ఐపీఎస్, తెలంగాణ కేడర్
ఐదు బ్యాచ్‌ల మహిళా ఐపీఎస్‌ల సంఖ్య, శాతం
బ్యాచ్ మొత్తం మహిళలు శాతం
73 ఆర్‌ఆర్ (2020) 121 25 20.66
74 ఆర్‌ఆర్ (2021) 166 37 22.29
75 ఆర్‌ఆర్ (2022) 155 32 20.65
76 ఆర్‌ఆర్ (2023) 183 54 28.72
77 ఆర్‌ఆర్ (2024) 174 62 35.63