పద్మారావునగర్, వెలుగు: మహిళలు కేవలం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములుగా మిగిలిపోకుండా, నిర్ణయాత్మకమైన నాయకత్వ స్థానాల్లోకి రావాలని తెలంగాణ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా పిలుపునిచ్చారు. శనివారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (హెచ్‌ఎంఏ) ఆధ్వర్యంలో జరిగిన ‘ఎమర్జ్’ సమ్మిట్‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్పొరేట్, వ్యాపార రంగాల్లో మహిళలు తమ ప్రతిభతో లీడర్షిప్ పొజీషన్లను దక్కించుకోవాలని సూచించారు.
హెచ్‌ఎంఏ అధ్యక్షుడు ఆల్వాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్నత విద్య, స్టార్టప్‌లలో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని, దేశంలోనే తెలంగాణ ఈ విషయంలో ముందంజలో ఉందని కొనియాడారు. మహిళలు కేవలం కుర్చీలో కూర్చోవడమే కాకుండా, ఆ కుర్చీని షేక్ చేసేలా ఎదగాలన్నారు. అనంతరం కామినేని ఆస్పత్రుల సీవోవో గాయత్రి కామినేని మాట్లాడుతూ.. నాయకత్వం అంటే కేవలం పదవి కాదని, వ్యవస్థలో సానుకూల మార్పు తేవడమేనన్నారు.
