- ఉమ్మడి జిల్లాలో పురుషుల కంటే 28,201 మంది మహిళలే ఎక్కువ
- నేటి నుంచి మొదటి విడత పంచాయతీలకు నామినేషన్లు
- 5 వేల ఓట్లు ఉంటే క్లస్టర్ఒక్కటే
యాదాద్రి, సూర్యాపేట, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో మహిళలే కీలక పాత్ర పోషించనున్నారు. పల్లెల్లోని ఓటర్ల తాజా లెక్క కూడా ఎన్నికల కమిషన్ తేల్చింది. ఉమ్మడి జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో గురువారం నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఇందుకోసం క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం ఓటర్లు 30,08,629 మంది ఉన్నారు. వీరిలో 1782 పంచాయతీల్లో 23 లక్షల మంది ఉండగా.. వీరిలో మహిళా ఓటర్లు 11,64,381 ఉన్నారు.
పురుషుల కంటే 28,201 మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులను ఎన్నుకోవడంలో వీరి పాత్ర క్రియాశీలకంగా మారింది. పైగా పోటీ చేసే వారిలో 45 శాతానికి పైగా మహిళలే ఉన్నారు.
నేటి నుంచే నామినేషన్లు
ఉమ్మడి జిల్లాలో మొదటి విడతలో 28 మండలాల్లోని 630 పంచాయతీకు సంబంధించి ఎన్నికల నామినేషన్ల కార్యక్రమం గురువారం నుంచి మొదలు కానుంది. ఇందులో భాగంగా కలెక్టర్లు బుధవారం ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీలకు శిక్షణ ఇచ్చారు. నామినేషన్ల స్వీకరణకు అవసరమయ్యే ఎన్నికల సామగ్రి గ్రామాలకు చేరుతోంది. ఐదు వేల ఓట్ల కంటే తక్కువగా ఉన్న నాలుగైదు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. క్లస్టర్ గ్రామాల్లో ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.
30న నామినేషన్ల పరిశీలన, అదే రోజు సాయంత్రం అర్హత కలిగిన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. దీని పైన డిసెంబర్ 1న అభ్యంతరాలు స్వీకరించి, 2న పరిష్కరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ డిసెంబర్ 3. కాగా అదే రోజు ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల తుది జాబితా వెల్లడిస్తారు. మొదటి విడత ఎన్నికలు డిసెంబర్ 11న జరు గుతాయి.
ఎన్నికల కోడ్ అమలు
రాష్ట్ర ఎన్నికల కమిషన్ గెజిట్ ను రిలీజ్ చేయగానే కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో రాజకీయ పార్టీల ప్రచారానికి సంబంధించిన ప్లెక్సీలు, గుర్తులు వంటి వాటిని తొలగించారు. విగ్రహాలకు ముసుగులు వేశారు. జాతీయ రహదారులతో పాటు, జిల్లా సరిహద్దుల్లో బారీకేడ్లు ఏర్పాటు చేశారు. చెక్‌పోస్టులు కూడా ఏర్పాటు చేశారు.
వేలం వేస్తే కఠిన చర్యలు: హనుమంతరావు, కలెక్టర్, యాదాద్రి
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులను వేలం ద్వారా దక్కించుకోవాలని ఎలాంటి ప్రయత్నాలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్దతిలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాలని సూచించారు. అలాకాకుండా వేలం పాటలు నిర్వహించినా, అలాంటి ప్రయత్నాలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఉమ్మడి జిల్లాలో ఓటర్లు
జిల్లా పురుషులు మహిళలు థర్డ్ జెండర్ మొత్తం
యాదాద్రి 2,64,577 2,67,661 2 5,32,240
సూర్యాపేట 3,40,743 3,54,050 22 6,94,815
నల్గొండ 5,30,860 5,42, 589 57 10,73,506
