
హైదరాబాద్ సిటీలో భారీ వర్షం కురిసింది. ఆదివారం (సెప్టెంబర్ 21) ఉదయం నుంచి నగరంలో పొడి వాతావరణం ఉండగా రాత్రి సమయానికి వెదర్ ఒక్కసారిగా చేంజ్ అయ్యింది. ఆకాశం మేఘావృతమై నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, మలక్ పేట, కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, జేఎన్టీయూ, నిజాంపేట్, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్, మూసాపేట్, బాలానగర్, ఫతేనగర్, ఎల్బీ నగర్, నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి, హయత్ నగర్, పెద్ద అంబర్ పేట్, ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, బాగ్ లింగంపల్లి, రాంనగర్, విద్యానగర్, గాంధీనగర్, కవాడిగూడ, దోమలగూడ, భోలక్ పూర్, అంబర్ పేట్, కాచిగూడ, బర్కత్ పూరా, నింబోలిఅడ్డ, బాగ్ అంబర్ పేట్ తదితర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది.
ఆదివారం (సెప్టెంబర్ 21) రాత్రి సిటీలో ఒక్కసారిగా వర్షం కురువడంతో బతుకమ్మ వేడుకలకు అంతరాయం కలిగింది. అయితే.. కొన్ని ప్రాంతాల్లో వర్షాన్ని కూడా లెక్కచేయకుండా చిన్నారులు, యువతులు, మహిళలు ఉత్సాహంగా వర్షంలోనే బతుకమ్మ ఆడిపాడారు. మన్సూరాబాద్‌లోని పెద్ద చెరువు దగ్గర వర్షంలోనే బతుకమ్మ ఆడారు మహిళలు. అదే విధంగా కొత్తపేటలోని అష్ట లక్ష్మీ దేవాలయం ప్రాంగణంలో కూడా వర్షంలోనే మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
వానలోనే బతుకమ్మ నిమజ్జనం చేశారు. మరోవైపు.. వర్షంతో నగరంలోని ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది. వర్షపు నీరు రోడ్లపైకి చేరుకోవడంతో వాహనాలు ముందుకు కదలలేక ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు వాహనాల రద్దీని క్లియర్ చేశారు. జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలు, లోతట్టు ఏరియాల్లో సహయక చర్యలు చేపట్టారు. రాబోయే మూడు గంటల్లో సిటీకి భారీ వర్షం సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో మాన్సూన్ టీమ్‌లను అప్రమత్తం చేశారు అధికారులు.