- మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
ఆదిలాబాద్, వెలుగు : ‘జనాభా లెక్కలు పూర్తైన వెంటనే మహిళా బిల్లును మళ్లీ తీసుకొస్తాం.. మహిళా రిజర్వేషన్ అమలు చేసేందుకు బీజేపీ 100 శాతం కట్టుబడి ఉంది’ అని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు చెప్పారు. ఆదిలాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. 131వ రాజ్యాంగ సవరణగా తీసుకొచ్చిన మహిళా బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పటికీ ప్రతిపక్ష పార్టీల కారణంగా ఆమోదం పొందలేదన్నారు.
ప్రధాని మోదీని అడ్డుకున్నామని విర్రవీగుతున్న ప్రతిపక్షాలు.. భవిష్యత్‌లో మహిళల ఆగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించి వారి ప్రాతినిధ్యాన్ని పెంచడమే లక్ష్యంగా బీజేపీ ఈ బిల్లును తీసుకొచ్చిందని చెప్పారు. ఈ బిల్లు ద్వారానే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రాతినిధ్యం పెరుగుతుందన్నారు. పార్లమెంట్‌లో మహిళల సమస్యలు ప్రస్తావించకుండా ప్రతిపక్షాలు వ్యక్తిగత, కుటుంబ విషయాలపైనే సమయం వృథా చేశారని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సుమన్ జాదవ్, నాయకులు జ్యోతి, శైలజ, అశోక్, రేణుక, శ్వేత, అనిత పాల్గొన్నారు.

