- గ్రామీణ ప్రాంతాల్లో రూ.20,536 కోట్లు, పట్టణాల్లో రూ.6,085 కోట్లు..
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘జిల్లాల వారీగా ఎస్‌హెచ్‌జీ బ్యాంక్ లింకేజీ వార్షిక కార్యాచరణ ప్రణాళిక’ను అధికారులు ఖరారు చేశారు. ఈ ఏడాది గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళా సంఘాలకు కలిపి మొత్తం రూ.26,621.47 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇందులో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ(సెర్ప్) ద్వారా గ్రామీణ ప్రాంతాలకు రూ.20,536 కోట్లు, మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మునిసిపల్ ఏరియాస్(మెప్మా) ద్వారా పట్టణ ప్రాంతాలకు రూ.6,085 కోట్ల రుణాలు ఇవ్వనున్నారు. రుణాల కేటాయింపులో హైదరాబాద్ జిల్లా రూ.2,353.91 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ మొత్తం పూర్తిగా పట్టణ ప్రాంతాల(మెప్మా) పరిధిలోకే వస్తుంది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాలు కలిపి చూస్తే నిజామాబాద్ జిల్లా రూ.1,848.68 కోట్లతో రెండో స్థానంలో నిలవగా, నల్గొండ జిల్లా రూ.1,480.59 కోట్లతో మూడో స్థానంలో ఉంది. ఖమ్మంకు రూ.1,379 కోట్లు, కరీంనగర్ కు రూ.1,196 కోట్లు, సంగారెడ్డికి రూ.1,172 కోట్లు టాయించారు. వార్షిక ప్రణాళికలో గ్రామీణ ప్రాంత మహిళా సంఘాలకే అత్యధిక ప్రాధాన్యం లభించింది. రుణ లక్ష్యాల్లో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
ఈ జిల్లాలో కేవలం 406 పట్టణ సంఘాలకు రూ.25.75 కోట్లు మాత్రమే లక్ష్యంగా నిర్ణయించారు. ములుగు కు రూ.247 కోట్లు, జోగులాంబ గద్వాల కు రూ.288 కోట్లు కేటాయించారు. మహిళలు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవడంలో ఈ బ్యాంక్ లింకేజీ రుణాలు కీలకంగా మారనున్నాయి. బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని సకాలంలో టార్గెట్ రీచ్ కావాలని ప్రభుత్వం భావిస్తోంది.
