
- ‘ఇందిరా మహిళా శక్తి’తో మహిళా సంఘాలు వ్యాపారాలు చేస్తున్నయ్.. మంచి లాభాలు సాధిస్తున్నయ్
- మహిళలకు అవకాశమిస్తే ఉన్నత స్థానాలకు ఎదుగుతరు.. అందుకు నా కుటుంబమే ఉదాహరణ
- రూ.5 లక్షల పెట్టుబడితో బిజినెస్ మొదలుపెట్టి పైకొచ్చానని వెల్లడి
- ‘సీఐఐ ఇండియన్ ఉమెన్ అప్ లిఫ్ట్ వాయిస్ ఫర్ చేంజ్’ ప్రోగ్రామ్‌కు హాజరు
హైదరాబాద్, వెలుగు: మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకాంక్షించారు. అందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. అందుబాటులో ఉన్న అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
శుక్రవారం (సెప్టెంబర్ 12) హైదరాబాద్ హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా క్యాంపస్‌లో నిర్వహించిన ‘సీఐఐ ఇండియన్ ఉమెన్ అప్ లిఫ్ట్ వాయిస్ ఫర్ ఛేంజ్’ కార్యక్రమానికి మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) ఎంతగానో కృషి చేస్తున్నదని ఆయన అన్నారు. సీఐఐలో వనితా దాట్ల లాంటి విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తలు ఉండడం అభినందనీయమన్నారు.
“ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలను మా ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తున్నది. సర్కారు సపోర్టుతో మహిళా సంఘాల సభ్యులు బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇస్తున్నారు. పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి మంచి లాభాలు సాధిస్తున్నారు. 18 ఏండ్లు దాటిన ప్రతి మహిళా ఎస్‌హెచ్‌జీలో చేరొచ్చు. తక్కువ వడ్డీకే రుణాలు పొందవచ్చు. వాళ్లు సొంతంగా వ్యాపారం స్థాపించి నిలదొక్కుకునేలా ప్రభుత్వం సహకారం అందిస్తుంది” అని చెప్పారు.
కుటుంబాలను నిర్లక్ష్యం చేయొద్దు..
మహిళలకు అవకాశమిస్తే ఉన్నత స్థానాలకు ఎదుగుతారని, అందుకు తన కుటుంబమే ఉదాహరణ అని మంత్రి వివేక్ అన్నారు. ‘‘నా భార్య మా విద్యాసంస్థల బాధ్యతలను నిర్వహిస్తూ, మా కంపెనీకి ఎండీగా ఉన్నారు. మా ఇనిస్టిట్యూషన్స్‌లో 5,500 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. నిత్యం సవాళ్లను ఎదుర్కొంటూనే, విద్యాసంస్థల అభివృద్ధికి నా భార్య ఎన్నో ఇన్నోవేటివ్ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. నా కూతురు ఎంబీఏ పూర్తి చేసి మీడియా హౌస్‌ను పర్యవేక్షిస్తున్నారు. మా మీడియా హౌస్ తెలంగాణలోనే అతి పెద్దది. గతంలో మా ఇంట్లో నేను బాస్‌గా ఉంటే, ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఆరుగురు బాస్‌లు ఉన్నారు. వాళ్లంతా సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మహిళల అభిప్రాయాలను ప్రతి ఒక్కరూ పరిగణనలోకి తీసుకోవాలి. వారికి అవకాశాలు ఇస్తేఎంతో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. ఇందుకు నా కుటుంబమే ఉదాహరణ. మహిళలు ఇంటినిచూసుకోవడంతో పాటు వ్యాపారాలనూ నిర్వహించగలరు’’ అని చెప్పారు.
మనం జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయం మనకు కొత్త పాఠం నేర్పిస్తుందన్నారు. ‘‘నేను రూ.5 లక్షల అతి తక్కువ పెట్టుబడితో వ్యాపారం స్టార్ట్ చేసి కష్టపడి పైకొచ్చాను. మనం ఏ వ్యాపారం చేసినా కుటుంబాలను మాత్రం నిర్లక్ష్యం చేయవద్దు” అని సూచించారు. కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి సతీమణి, ప్రముఖ పారిశ్రామికవేత్త సరోజ, యూఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్, సీఐఐ తెలంగాణ ఆర్ ఎస్ రెడ్డి, సీఐఐ మాజీ చైర్మన్ వనిత దాట్ల, ఐడబ్ల్యూఎన్ ( ఇండియన్ ఉమెన్ నెట్ వర్క్) చైర్మన్ హేమ శ్రీనివాస్, డిప్యూటీ చైర్ పర్సన్ శివప్రియ బాలగోపాల్ పాల్గొన్నారు.