కార్యకర్తల వల్లే పదవుల్లో ఉన్నాం : మంత్రి జూపల్లి కృష్ణారావు

కార్యకర్తల వల్లే పదవుల్లో ఉన్నాం : మంత్రి జూపల్లి కృష్ణారావు

వనపర్తి, వెలుగు : కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు కష్టపడ్డారని, వారి వల్లే తాము మంత్రులుగా పదవుల్లో ఉన్నామని ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం వనపర్తి డీసీసీ అధ్యక్షుడిగా శివసేనారెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్యఅతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

 మరోసారి మొత్తం స్థానిక సంస్థల పదవులను కాంగ్రెస్సే గెలిచే వాతావరణం తీసుకురావాలన్నారు. మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. కాంగ్రస్ సెక్యులర్​పార్టీ అని, ఇందులో స్వేచ్ఛతోపాటు క్రమశిక్షణ ఉంటుందన్నారు. వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో 90 శాతం సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

రాజ్యసభ మాజీ  సభ్యుడు వి.హనుమంతరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్​లోని అనంతపూర్​లో ఆకలిచావులను చూసిన సోనియాగాంధీ.. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చారని, అలాంటి పథకానికి గాంధీ పేరును బీజేపీ తొలగించడం శోచనీయమన్నారు. పార్లమెంట్​లో బీసీ బిల్లు ఆమోదమైతే రాహుల్​గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడానికి అంత  ఒకేతాటిపైకి వచ్చి కష్టపడతామన్నారు. 

పాలమూరు-–రంగారెడ్డికి  రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తే వనపర్తిలో ఒక్క ఎకరానికి ఎందుకు నీరివ్వలేదని మాజీ మంత్రిని ఆయన ప్రశ్నించారు. నీరిచ్చినట్లయితే రాజీవ్​చౌక్​లో చర్చకు రావాలని సవాల్​విసిరారు. డీసీసీ ప్రెసిడెంట్​ శివసేనారెడ్డి మాట్లాడుతూ పార్టీ కుటుంబం లాంటిదని, ఎలాంటి గ్రూపులు లేవన్నారు. పార్టీ గెలుపు కోసం అంతా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డిని శాలువాతో సన్మానించి అభినందించారు. 

అంతకుముందు పట్టణంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి రాజీవ్​చౌక్​ మీదుగా సభా ప్రాంగణం వరకు బైక్​ర్యాలీ నిర్వహించారు. సభలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్​రెడ్డి, రాష్ట్ర నాయకులు మల్లయ్య, సంధ్యారెడ్డి, యాదయ్య, ధనలక్ష్మి, డీసీసీ మాజీ ప్రసిడెంట్లు రాజేంద్రప్రసాద్, శంకర్​ప్రసాద్​, ఏఎంసీ చైర్మన్​ శ్రీనివాస్​గౌడ్​ పాల్గొన్నారు.