పెద్దపల్లి జిల్లా పెద్దంపేటలో ఐకేపీ సెంటర్లలో ధాన్యం తూకం వేసేందుకు హమాలీలు లేకపోవడంతో.. మహిళలే హమాలీలుగా మారారు.ధాన్యం తూకం వేసేందుకు హమాలీలు లేకపోవడంతో ఐకేపీ కేంద్రాల్లో వరి ధాన్యం రోజుల తరబడి నిల్వ ఉండడం, అకాల వర్షాలకు నష్టపోయే అవకాశం ఉన్నందున రైతులు ఇబ్బందులు పడకుండా మహిళలు ముందుకు వచ్చారు. అకాల వర్షాలకు వడ్లు తడిసిపోయే ప్రమాదం ఉండటంతో మహిళలే సమిష్టిగా ముందుకు వచ్చి ధాన్యం తూకం వేసి తరలించేందుకు సిద్దమయ్యారు. వివరాల్లోకి వెళితే..
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో బుధవారం(మే 20) ఐకేపీ సెంటర్లలో ధాన్యం తూకం వేసేందుకు మహిళలు హమాలీలుగా మారారు. ధాన్యాన్ని బస్తాలలో నింపి తూకం వేశారు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా మహిళలు హమాలీల కొరతను భర్తీ చేశారు. అకాల వర్షం పడితే రైతులు నష్టపోవాల్సి వస్తుందని, అందుకే ఐకెపి కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యాన్ని తరలించేందుకు సిద్ధమయ్యామని మహిళ చెప్పారు. దీంతో స్థానిక నేతలు మహిళ హమాలీలను అభినందించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్యాల మహేష్ మహిళలకు శాలువ కప్పి సన్మానించారు.
