
- పరిషత్ ఓటర్లలో మహిళల సంఖ్యే ఎక్కువ
- ఖమ్మం జిల్లాలో 8,02,690 మంది ఓటర్లు
- భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 6,69,048 ఓటర్లు
ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలే కీలక పాత్ర పోషించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను అధికారులు బుధవారం రిలీజ్ చేశారు. ఈ రెండు జిల్లాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది.
ఎక్కడెక్కడా ఏ పరిస్థితి?
ఖమ్మం జిల్లాలో మొత్తం 20 మండలాలున్నాయి. వీటిలో మొత్తం 8,02,690 మంది ఓటర్లున్నారు. వీరిలో 4,14,425 మంది మహిళలు కాగా, 3,88,243 మంది పురుషులున్నారు. మరో 22 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. ఖమ్మం జిల్లాలో పురుషుల కంటే 26,182 మంది ఎక్కువగా మహిళా ఓటర్లున్నారు. ఖమ్మం జిల్లాలో జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల కోసం మొత్తం 1,580 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 మండలాలున్నాయి. వీటిలో 22 జడ్పీటీసీలు, 233ఎంపీటీసీల పరిధిలో 6,69,048 మంది ఓటర్లు నమోదయ్యారు. జడ్పీ, మండల పరిషత్ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. పురుష ఓటర్ల కంటే 18,934 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. మొత్తం 3,25,045 మంది పురుష ఓటర్లు, 3,43,979 మంది మహిళా ఓటర్లు, 24 మంది ఇతరులున్నారు.
ఆళ్లపల్లి మండలంలో అతి తక్కువగా కేవలం 9,314 మంది ఓటర్లే ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా బూర్గంపహాడ్ మండలంలో 50,351 మంది ఓటర్లు నమోదయ్యారు.
పంచాయతీల్లో ఓటర్ల ముసాయిదా రిలీజ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 471 పంచాయతీలు, 4168 పంచాయతీ వార్డులు ఉన్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలున్న క్రమంలో ఇప్పటికే పంచాయతీలకు సంబంధించి ఓటర్ల ముసాయిదాను పంచాయతీ అధికారులు ప్రకటించారు. జిల్లాలోని 471 పంచాయతీలకు గానూ అత్యధికంగా దుమ్ముగూడెం మండలంలో 37 పంచాయతీలలో 324 పంచాయతీ వార్డులున్నాయి. బూర్గంపహాడ్, దమ్మపేట మండలాల్లో అత్యధికంగా 17 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. భద్రాచలంలో ఒకే పంచాయతీ ఉండగా 20 పంచాయతీ వార్డులు, 14 ఎంపీటీసీలుండడం గమనార్హం.