సెల్ టవర్ తొలగించాలంటూ టవర్ ఎక్కిన మహిళలు

సెల్ టవర్ తొలగించాలంటూ టవర్ ఎక్కిన మహిళలు

వికారాబాద్: తమ కాలనీలో సెల్ టవర్ ఏర్పాటు చెయ్యొద్దంటూ.. కొత్తగా ఏర్పాటు చేస్తున్న టవర్ ని వెంటనే ఇక్కడి నుంచి తొలగించాలంటూ సెల్ టవర్ ఎక్కి హంగామా చేశారు ఆ కాలనీ మహిళలు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు నాయకోటి వాడ కాలనీ శివారులో కొత్తగా ఎయిర్ టెల్ కంపెనీ సెల్ టవర్ నిర్మాణం జరుగుతోంది. ఆ సెల్ టవర్ నిర్మాణం ప్రారంభించిన వెంటనే కాలనీ వాసులు తీవ్రంగా వ్యతిరేకించారు. నిర్మాణం ప్రారంభించిన కాంట్రాక్టర్ తో వాగ్వాదం చేసి ప్రయోజనం లేదని మున్సిపల్ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అంతేకాదు జిల్లా కలెక్టర్ ఆఫీసుకు వెళ్లి కూడా ఫిర్యాదు చేశారు. తమ కాలనీకి కనీసం ఒక కిలోమీటర్ దూరంలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోమని కాలనీ వాసులు సూచిస్తున్నారు. కాలనీవాసుల వ్యతిరేకతను అధికారులు కానీ.. టవర్ కంపెనీ వారు కానీ పట్టించుకోలేదు. స్థానికుల వ్యతిరేకతను ఏ మాత్రం పట్టించుకోకుండా టవర్ నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. దీంతో సహనం నశించిన కాలనీ మహిళలు ఈ సమస్య తీరాలంటే టవర్ ఎక్కడమే మార్గమని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఇవాళ సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేసి నిరసన తెలియజేశారు. మొబైల్ టవర్ రేడియేషన్ వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటాయని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లల ప్రాణాలకు హాని కలుగుతుందని, కాలనీలో పెద్దలే ఎక్కువగా ఉన్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రేడియేషన్ ద్వారా ఇంకా అనారోగ్యం కలిగి ఆస్పత్రుల చుట్టూ తిరిగే పరిస్థితి తీసుకురావద్దని అంటున్నారు. తామంతా పేద మధ్య తరగతి వారమని.. అనారోగ్యాలకు గురైతే ఆసుపత్రుల చుట్టూ తిరిగేంత డబ్బులు, శక్తి, ఓపిక, సమయం తమకు లేదన్నారు. కాలనీ వాసుల నిరసన గురించిన సమాచారం అందుకున్న పోలీసులు టవర్ ఎక్కిన లక్ష్మీ,మరో మహిళ వరలక్ష్మి ఇద్దరిని సముదాయించారు. అంతలోనే మరో మహిళ పురుగుల మందు తాగేందుకు  ప్రయత్నించింది. మహిళ ఆత్మహత్యా యత్నాన్ని పసిగట్టిన పోలీసులు వెంటనే అప్రమత్తమై మహిళ చేతిలోని పురుగుల మందు లాక్కున్నారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు పోలీసులు.