ఆడపిల్లలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నం: మోదీ

ఆడపిల్లలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నం:  మోదీ
  • మహిళా బిల్లు.. దేశ కొత్త భవిష్యత్తుకు నాంది: ప్రధాని నరేంద్ర మోదీ  
  • ‘రోజ్ గార్ మేళా’లో 51 వేల మందికి జాబ్ లెటర్లు అందజేత

న్యూఢిల్లీ: ఆడపిల్లలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని, అదే తమ ప్రభుత్వ విధానమని ప్రధాని మోదీ అన్నారు. ఇటీవల ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ల బిల్లు.. దేశ కొత్త భవిష్యత్తుకు నాంది పలికిందని పేర్కొన్నారు. ‘‘ఇది మనం చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న, విజయాలు సాధిస్తున్న సమయం. ఇటీవల ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లుతో దేశంలోని 50% మందికి ప్రయోజనం చేకూరుతుంది. అంతరిక్షం నుంచి ఆటల వరకు అన్ని రంగాల్లో మహిళలు ఉన్నారు. ఆర్మీలోనూ సేవలందిస్తున్నారు. 

మహిళలు ఉన్న ప్రతి రంగంలోనూ సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి” అని చెప్పారు. మంగళవారం ‘రోజ్ గార్ మేళా’లో భాగంగా వివిధ డిపార్ట్ మెంట్లలో జాబ్స్ పొందిన 51 వేల మందికి మోదీ వర్చువల్​గా అపాయింట్ మెంట్ లెటర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల ఆలోచన ఏండ్ల కిందనే పుట్టింది. ఇప్పుడు జాబ్ లెటర్లు అందుకున్నోళ్లలో చాలామంది అప్పటికి పుట్టనేలేదు” అని అన్నారు. 

టెక్నాలజీని వాడుకోండి.. 

ప్రభుత్వ పథకాల అమలులో టెక్నాలజీ వినియోగంతో అవినీతికి అడ్డుకట్ట పడిందని మోదీ అన్నారు. ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు. ‘ప్రజలే ఫస్ట్’ అనే లక్ష్యంతో పని చేయాలని కొత్త ఉద్యోగులకు సూచించారు. టెక్నాలజీని మరింత వినియోగించుకుని, పాలనలో మరిన్ని మార్పులు తేవాలని పిలుపునిచ్చారు. ‘‘దేశ జీడీపీ పెరుగుతోంది. రెన్యూవబుల్ ఎనర్జీ, ఆర్గానిక్ ఫామింగ్, డిఫెన్స్, టూరిజం రంగాల్లో చాలా అభివృద్ధి జరుగుతోంది. 

మొబైల్ ఫోన్స్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్​ల వరకు, కరోనా వ్యాక్సిన్ నుంచి ఫైటర్ జెట్స్ వరకు ‘ఆత్మనిర్భర్ భారత్’తో అద్భుతమైన ఫలితాలు సాధించాం” అని పేర్కొన్నారు. కాగా, రెండ్రోజుల పర్యటన నిమిత్తం మోదీ మంగళవారం గుజరాత్ కు వెళ్లారు. బుధవారం అక్కడ జరగనున్న ‘వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్’ 20 ఏండ్ల వేడుకల్లో పాల్గొంటారు.

ఇప్పటిదాకా 9 లక్షల ఉద్యోగాలిచ్చాం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటివరకు తొమ్మిది లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చిన తొలి తొమ్మిదేండ్లలో 6 లక్షల మందికే జాబ్స్ ఇచ్చిందన్నారు. మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన 'రోజ్‌‌గార్ మేళా' కార్యక్రమంలో జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఉపాధి అంటే ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదని యువతకు ప్రధాని అవగాహన కల్పించారని తెలిపారు.

 అందుకే  స్టార్టప్‌‌ల సంఖ్య 350  నుంచి 1.25 లక్షలకు పెరిగిందని చెప్పారు. గతంలో స్పేస్ సెక్టార్లో  స్టార్టప్‌‌ల సంఖ్య కేవలం నాలుగు మాత్రమేనని తెలిపిన కేంద్రమంత్రి.. ప్రస్తుతం ఆ సంఖ్య 150కి పెరిగిందని వెల్లడించారు.