Women's Cricket World Cup 2025: 50 రోజుల్లో మహిళల వన్డే వరల్డ్ కప్.. ఈ సారి కప్ మిస్ అవ్వదంటున్న కెప్టెన్

Women's Cricket World Cup 2025: 50 రోజుల్లో మహిళల వన్డే వరల్డ్ కప్.. ఈ సారి కప్ మిస్ అవ్వదంటున్న కెప్టెన్

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 కు భారత్ వేదికగా జరగనుంది. ఈ టోర్నీ 2025, సెప్టెంబర్ 30 నుంచి 2025 నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంకలోని ఐదు వేదికలలో హైబ్రిడ్ మోడ్‎లో జరగనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. మహిళల వన్డే వరల్డ్ కప్ తేదీలు, వేదికలతో   పాటు పూర్తి షెడ్యూల్ ను ఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ కు మరో 50 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సందర్భంగా '50 డేస్ టు గో' అనే స్పెషల్ ఈవెంట్ ను బీసీసీఐ ఏర్పాటు చేసింది. 

సోమవారం (ఆగస్టు 11) ముంబైలో జరిగిన ప్యానెల్ చర్చలో మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్.. ప్రస్తుత టీమిండియా మహిళా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్టార్ బ్యాటర్లు కెప్టెన్ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా, ఐసీసీ అధ్యక్షుడు జైషా, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వరల్డ్ కప్ 2025 గురించి మాట్లాడారు. 

"మహిళల ప్రపంచ కప్ కు ఇంకా 50 రోజులు మిగిలి ఉండగా ఈ రోజు అద్భుతమైన వేడుక నిర్వహించాము. ఈ టోర్నీ ఇప్పటివరకు జరగని అతిపెద్ద మహిళా క్రికెట్ ఈవెంట్ అవుతుంది. టోర్నమెంట్ ప్రారంభానికి ఇంకా 50 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో సన్నాహాలు బాగా జరుగుతున్నాయి. ఈ ఛాలెంజ్ కు సిద్ధమవుతున్న అన్ని జట్లకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇండియా, శ్రీలంక జట్లకు మరపురాని అనుభవం ఇస్తుందని నేను విశ్వసిస్తున్నాను" అని షా ఐసీసీ ప్రకటనలో తెలిపారు.

ALSO READ : జాన్ బట్లర్ మరణం.. తొలి మ్యాచ్‌లోనే డకౌట్ అయిన కొడుకు

మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. "ఆస్ట్రేలియాతో ఆడటం ఎల్లప్పుడూ సవాలుతో కూడుకున్నది. వరల్డ్ కప్ కు ముందు ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్ మాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ప్రాక్టీస్ లో జట్టు ఎంతగానో కృషి చేస్తోంది. భారతీయులందరూ ఎదురుచూస్తున్న కలను నెరవేరుస్తాం. వరల్డ్ కప్ గెలవలేమనే అడ్డంకిని బ్రేక్ చేయాలనుకుంటున్నాం. ప్రపంచ కప్‌ టోర్నీలో ఎప్పుడూ ప్రత్యేకమైనవి. నేను యువీ భయ్యా (యువరాజ్ సింగ్) ని చూసినప్పుడల్లా నాకు చాలా ప్రేరణనిస్తుంది" అని హర్మన్ ఈ ఏ ఈవెంట్ లో చెప్పుకొచ్చింది. 

మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీ 2025, సెప్టెంబర్ 30 నుంచి 2025 నవంబర్ 2 వరకు భారత్, శ్రీలంకలోని ఐదు వేదికలలో హైబ్రిడ్ మోడ్‎లో జరగనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. భారత్‎లోని బెంగళూరు, గౌహతి, ఇండోర్, విశాఖపట్నం స్టేడియాల్లో మ్యాచులు జరగనున్నాయి. పాకిస్తాన్ తమ మ్యాచ్‌లను శ్రీలంక కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడనుంది. భద్రతా కారణాల దృష్ట్యా పాక్ వెళ్లేందుకు భారత జట్టు నిరాకరించింది. దీంతో టోర్నీని హైబ్రిడ్ మోడ్‎లో నిర్వహించి.. భారత్ ఆడే మ్యాచులను దుబాయ్ వేదికగా నిర్వహించారు. 

సెప్టెంబర్ 30న ఆతిథ్య భారత్.. శ్రీలంకతో టోర్నీ తొలి మ్యాచ్ లో తలపడుతుంది.  బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత రోజు అక్టోబర్ 1 న డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. అందరూ ఎదురు చూసే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కొలంబో వేదికగా అక్టోబర్ 5 న మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది.

రౌండ్-రాబిన్ దశ అక్టోబర్ 26 వరకు జరుగుతుంది. సెమీఫైనల్స్ అక్టోబర్ 29,30 తేదీలలో జరగనున్నాయి. నవంబర్ 2న జరిగే ఫైనల్ తో టోర్నీ ముగుస్తుంది. రౌండ్-రాబిన్ లో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. మొదటి స్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానంలో నిలిచిన జట్టుతో.. రెండో స్థానంలో నిలిచిన జట్టు మూడో స్థానంలో నిలిచిన జట్టుతో సెమీ ఫైనల్ ఆడతాయి.