జోరు కొనసాగేనా?..ఇవాళ బంగ్లాదేశ్ తో ఇండియా ఢీ

జోరు కొనసాగేనా?..ఇవాళ బంగ్లాదేశ్ తో ఇండియా ఢీ

పెర్త్‌‌: టీ20 వరల్డ్‌‌కప్‌‌లో ఇండియా మహిళల జట్టు మరో చాలెంజ్‌‌కు సిద్ధమైంది. టీ20 వరల్డ్‌‌కప్‌‌లో సోమవారం బంగ్లాదేశ్‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లో ఆసీస్‌‌ను ఓడించినా.. కొన్ని లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఇండియాకు ఎంతైనా ఉంది. మెగా ఈవెంట్‌‌కు ముందు జరిగిన ట్రై సిరీస్‌‌ నుంచి బ్యాటింగ్‌‌లో నిలకడలేమితో ఇబ్బందిపడుతున్న టీమిండియా.. భారీ స్కోర్లు చేయలేకపోతోంది. ఓపెనర్లు స్మృతి, షెఫాలీ మెరుపు ఆరంభాన్ని అందిస్తున్నా.. మిడిలార్డర్‌‌ పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ వైఫల్యం టీమ్‌‌ను వెంటాడుతోంది. జెమీమా కూడా స్థాయికి తగ్గట్లుగా ఆడలేకపోవడం ప్రతికూలాంశం. ఈ ఇద్దరు షాట్ సెలక్షన్స్‌‌ను మరింత ఇంప్రూవ్‌‌ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్‌‌తో జరిగిన గత ఐదు టీ20ల్లో ఇండియా మూడు మ్యాచ్‌‌లు నెగ్గింది. అయితే లాస్ట్‌‌ రెండు మ్యాచ్‌‌ల్లో గెలవడం బంగ్లా ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. కాబట్టి ఈ మ్యాచ్‌‌లో టీమిండియా టాప్‌‌ ఆర్డర్‌‌ రాణించకపోతే ఇబ్బందులు తప్పవు. మిడిల్‌‌లో దీప్తి శర్మ మరోసారి ఫామ్‌‌ కొనసాగిస్తే టీమ్‌‌కు తిరుగుండదు. ఇక బౌలింగ్‌‌లో మీడియం పేసర్‌‌ శిఖా పాండే, అరుంధతి రెడ్డితో సహా అందరూ మంచి టచ్‌‌లో ఉన్నారు. స్పిన్‌‌లో పూనమ్‌‌ యాదవ్‌‌.. ఇండియాకు పెద్ద దిక్కుగా మారింది. ఆసీస్‌‌తో స్వల్ప స్కోరును కాపాడటమే ఇందుకు నిదర్శనం. ఓవరాల్‌‌గా తొలి మ్యాచ్‌‌ జట్టును యధావిధిగా దించాలని ఇండియా మేనేజ్‌‌మెంట్‌‌ భావిస్తోంది. వాకా పిచ్‌‌ స్పిన్‌‌కు అనుకూలం. కాబట్టి ఇండియా ఎక్స్‌‌ట్రా        స్పిన్నర్‌‌ను తీసుకుంటుందో చూడాలి.

ఆ ఇద్దరూ కీలకం

టీ20 వరల్డ్‌‌కప్‌‌లో బంగ్లాకు ఇది తొలి మ్యాచ్‌‌ కావడంతో విజయంతో బోణీ కొట్టాలని ఆరాటపడుతోంది. టీమిండియాతో పోలిస్తే పెర్ఫామెన్స్‌‌ పరంగా, టీమ్‌‌ పరంగా  రెండు అడుగులు వెనకే ఉన్నా.. తమదైన రోజున బంగ్లా చెలరేగి ఆడుతుంది. ఇందుకు గత ఫలితాలే నిదర్శనం. ఆల్‌‌రౌండర్‌‌ జహనరా ఆలమ్‌‌, టాప్‌‌ ఆర్డర్‌‌ బ్యాట్స్‌‌వుమన్‌‌ ఫర్జానా హక్‌‌ కీలకం కానున్నారు. పొట్టి ఫార్మాట్‌‌లో ఓ సెంచరీ కూడా చేసిన ఫర్జానా.. ఆసియా కప్‌‌లో ఇండియాను ఓడించడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఆడాలని ప్లాన్స్‌‌ వేస్తోంది. తన పేస్‌‌ బౌలింగ్‌‌లో ఆరంభంలో స్ట్రయిక్‌‌ వికెట్లు తీసే జహనరాను తక్కువగా అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుంది. సీనియర్‌‌ ప్లేయర్‌‌, కెప్టెన్‌‌ సల్మాఖాతున్‌‌ కూడా అవకాశం కోసం వేచి చూస్తోంది. ఓపికగా ఆడితే భారీ స్కోర్లు చేసే చాన్స్‌‌ ఉన్న పిచ్‌‌పై ఛేజింగ్‌‌ చేయడం ఈజీగా కనిపిస్తోంది.

జట్లు (అంచనా):

ఇండియా: హర్మన్‌‌ప్రీత్‌‌ (కెప్టెన్‌‌), స్మృతి, షెఫాలీ, జెమీమా, దీప్తి, వేదా కృష్ణమూర్తి, శిఖా పాండే, తానియా, అరుంధతి, పూనమ్‌‌,  రాజేశ్వరి గైక్వాడ్‌‌.

బంగ్లాదేశ్‌‌: సల్మాఖాతున్‌‌ (కెప్టెన్‌‌), షమీమా, ముర్షిదా, సంజిదా ఇస్లామ్‌‌, నిగర్‌‌ సుల్తానా, ఫర్జానా, రుమానా, రితూ మోని, ఆలమ్‌‌, ఖదిజా, నిహిదా అక్తర్‌‌.