రేపే టీ20 వరల్డ్ కప్ ఫైనల్

రేపే టీ20 వరల్డ్ కప్ ఫైనల్

మెల్‌‌బోర్న్‌‌: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌‌ అభిమానులు ఎదురు చూస్తున్న సమయం ఆసన్నం అవుతోంది. ముఖ్యంగా మహిళా క్రికెటర్లు, వారి ఆటను ఇష్టపడే ఫ్యాన్స్‌‌ను కనువిందు చేసేందుకు చారిత్రక సమరం సిద్ధమవుతోంది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం మెల్‌‌బోర్న్‌‌ క్రికెట్‌‌ స్టేడియంలో జరగబోయే టీ20 వరల్డ్‌‌కప్‌‌ ఫైనల్‌‌ మహిళా క్రికెట్‌‌ చరిత్రలోనే అతి పెద్ద మ్యాచ్‌‌ కాబోతోంది. అంతేకాదు మహిళా దినోత్సవం రోజు జరిగే ఈ పోరు మహిళల క్రీడల చరిత్రలో అత్యధిక మంది ప్రేక్షకుల సమక్షంలో జరిగిన మ్యాచ్‌‌గా రికార్డు సృష్టించే అవకాశం కూడా కనిపిస్తోంది. లాస్‌‌ ఏంజెల్స్‌‌లో 1999లో జరిగిన మహిళల సాకర్‌‌ వరల్డ్‌‌కప్‌‌ ఫైనల్‌‌కు అత్యధికంగా 90,185 మంది హాజరయ్యారు. ఇప్పుడా రికార్డును బద్దలుకొట్టే అవకాశం ఇండియా, ఆస్ట్రేలియా టైటిల్‌‌ ఫైట్‌‌ ముందుంది. ఎంసీజీ స్టేడియం కెపాసిటీ లక్ష పైచిలుకు కాగా. శుక్రవారం వరకే 75 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. ఆదివారం సాయంత్రం వరకూ సమయం ఉండడం, రేటు కూడా తక్కువ (పెద్దలకు 20 ఆస్ట్రేలియన్‌‌ డాలర్లు, పిల్లలకు 5 డాలర్లు) కావడంతో  స్టేడియం మొత్తం నిండిపోయే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. పైగా ‘ఫిల్‌‌ ద ఎమ్‌‌సీజీ’అనే హ్యాష్‌‌ట్యాగ్‌‌తో చాన్నాళ్ల నుంచి సోషల్‌‌ మీడియాలో ప్రమోషన్‌‌ నడుస్తోంది. ఇక, ఆస్ట్రేలియా మహిళలు తమ సొంతగడ్డపై ఓ ఐసీసీ టోర్నీ ఫైనల్లో తలపడడం ఇది రెండోసారి. 1988 వన్డే వరల్డ్‌‌కప్‌‌ తుదిపోరులో ఇంగ్లండ్‌‌పై గెలిచింది. ఇదే ఎంసీజీలో జరిగిన నాటి మ్యాచ్‌‌కు కేవలం మూడు వేల మంది మాత్రమే హాజరయ్యారు. కానీ, ఇప్పుడు అమ్మాయిల క్రికెట్​కూ క్రేజ్‌‌ వచ్చింది. దాంతో స్టేడియానికి వేలాది మంది రావడంతో పాటు టీవీల్లో కోట్లమంది వారి ఆట చూడబోతున్నారు . కప్పు ఎవరు గెలిచినా ఈ ఫైనల్‌‌ మాత్రం చరిత్రలో నిలిచిపోవడం ఖాయమే అనిపిస్తోంది.

పాప్‌‌ స్టార్‌‌ కేటీ పెర్సీ ఆటాపాటా

ఫైనల్‌‌ మ్యాచ్‌‌కు ముందు నిర్వాహకులు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో అమెరికా పాప్‌‌ స్టార్‌‌ కేటీ పెర్రీ లైవ్‌‌ పెర్ఫామెన్స్‌‌ ఇవ్వనుంది. మ్యాచ్‌‌కు అరగంట ముందు మైదానంలోకి రానున్న కేటీ.. 15 నుంచి 20 నిమిషాలపాటు తన ఆటాపాటతో అలరించనుంది.

వర్షం ముప్పు లేదు

భారీ వర్షం కారణంగా ఓ సెమీఫైనల్‌‌ రద్దు కావడం, మరో సెమీస్‌‌లో ఓవర్లు కుదించిన నేపథ్యంలో ఫైనల్‌‌ మ్యాచ్‌‌ రోజు వాతావరణ పరిస్థితులపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే, ఆదివారం మెల్‌‌బోర్న్‌‌లో వర్ష సూచన లేదు. వాతావరణం కూడా పొడిగా ఉంటుంది. సాయంత్రం మాత్రం చల్లగా ఉండనుంది. అనుకోకుండా వర్షం వచ్చినా సోమవారం రిజర్వ్‌‌ డే ఉండనే ఉంది.