సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ‘గివ్ టూ గైన్’ థీమ్‌తో జరిగిన వేడుకల్లో మియాపూర్, పటాన్చెరు, నిజాంపేట్, మాదాపూర్ ప్రాంతాలకు చెందిన మహిళా పారిశుధ్య కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో సైబరాబాద్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్ సృజన పాల్గొన్నారు. సేవ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు విజయ్ రామ్, న్యూట్రిషనిస్ట్ డాక్టర్ నిదా ఫాతిమా పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా నాగులపల్లిలో హెరిటేజ్ సంస్థ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం, మహిళా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్మన్ నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హెరిటేజ్ అగ్రస్థానంలో కొనసాగడంలో 50 శాతం వాటా మహిళలదేనని, ప్రతిరోజూ సుమారు 3 లక్షల లీటర్ల పాలను అందిస్తూ మహిళా రైతులు ఆర్థికంగా బలోపేతం కావడం హర్షించదగ్గ విషయమన్నారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మధుర నగర్‌లోని శిశు విహార్‌ను విజిట్‌చేసి స్టేట్ హోమ్ లో చదువుతున్న కవలలు వీణ–వాణిలను సత్కరించారు. వారికి కొత్త బట్టలు పెట్టారు. వారి చదువుల కోసం రెండు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడంతో పాటు సీఏ కోచింగ్‌కు పూర్తి స్థాయిలో సహకారిస్తానని హామీ ఇచ్చారు.
స్త్రీ గొప్పతనాన్ని, త్యాగాన్ని ఒక్కరోజుకే పరిమితం చేయకుండా ప్రతిక్షణం ఆమెను గౌరవించాలని జస్టిస్ రాధారాణి అన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారుల, ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో కింగ్ కోఠిలో నిర్వహించిన వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, వెంకటరామయ్య, వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
భాగ్యనగర నందనవనం పార్కులో ఈస్ట్ హైదరాబాద్ ఆరోగ్య రన్ 3.0 నిర్వహించారు. రాచకొండ రన్నర్స్ ఆర్గనైజర్ప్రభాకర్ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్లో భారీ సంఖ్యలో మహిళలు, క్రీడాకారులు, ఏసీపీ నవీన్ రెడ్డి, పీర్జాగూడ కాంగ్రెస్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, సీఐ మక్బూల్‌జానీ, మాజీ కార్పొరేటర్ యుగేందర్ రెడ్డి పాల్గొన్నారు.
నారీ శక్తి, యుటిల్ మానవ హక్కుల సంఘం సహకారంతో మహిళా సాధికారత నవభారత నిర్మాణానికి మూలస్తంభం అనే అంశంపై మౌలాలి హెచ్‌బీ కాలనీలో సదస్సు నిర్వహించారు. యుటిల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సౌత్ ఇండియా చైర్మన్ ఎన్. నిత్యానంద్, తెలంగాణ చైర్మన్ ఏ. కిషోర్ రావు, కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, విమెన్ వింగ్ సెక్రటరీ పల్లవి రావు, సాహితీ ఫౌండేషన్ ప్రతినిధులు పంజాల పల్లవి, మమత పాల్గొన్నారు.
ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి ఉమర్ ఆలీషా ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉమర్ ఆలీషా మాట్లాడుతూ మహిళలకు తోడ్పాటు అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు.
ఆకాశంలో సగం కాదు.. అన్నింటా తామే అని నిరూపిస్తున్న నారీశక్తికి భాగ్యనగరం నీరాజనం పలికింది. లోకానికి వెలుగునిచ్చే ఆదిశక్తికి.. అంకితభావంతో సేవలందిస్తున్న అపరశక్తికి సలాం చేసింది. ఆదివారం మహిళా దినోత్సవ వేళ హైదరాబాద్ వ్యాప్తంగా కోలాహలం నెలకొంది. పోలీస్ స్టేషన్ల నుంచి కోర్టుల వరకు, బస్తీల నుంచి కార్పొరేట్ ఆఫీసుల వరకు వేడుకలు అంబరాన్నంటాయి. శాంతిభద్రతల పరిరక్షణలో ముందుండే మహిళా పోలీసులు, న్యాయం కోసం పోరాడే న్యాయవాదులు, న్యాయమూర్తులు, సామాజిక సేవలో నిమగ్నమైన స్వచ్ఛంద కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులను, ఆశావర్కర్లను ఇలా ప్రతి ఒక్కరి సేవలను కొనియాడుతూ సత్కారాలు నిర్వహించారు. సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న అతివలను కొనియాడారు. – వెలుగు, సిటీ నెట్వర్క్
