మహిళా సంఘాలకు సోషల్ ఆడిట్‌పై శిక్షణ

మహిళా సంఘాలకు సోషల్ ఆడిట్‌పై శిక్షణ
  •     21 నుంచి 23 వరకు వర్క్ షాప్
  •     హైదరాబాద్ లోని సిపార్డ్​లో  ట్రైనింగ్ ఇవ్వనున్న సాట్

హైదరాబాద్, వెలుగు: మహిళా సంఘాల సభ్యులకు సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్)పై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పథకాలతోపాటు ఉపాధి హామీ పనులు అసలైన లబ్ధిదారులకు చేరుతున్నాయా.. లేదా..? నిధుల వినియోగంలో పారదర్శకత ఎలా ఉంది..? అనే అంశాలపై మహిళా సంఘాలకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 21, 22, 23 తేదీల్లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని టీఎస్ సిపార్డ్​(తెలంగాణ స్టేట్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్) లో వర్క్ షాప్ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ (సీఆర్పీ)కు సాట్ ( సొసైటీ ఫర్ సోషల్ ఆడిట్, అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పరెన్సీ) ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శిక్షణ పొందిన సీఆర్పీలు తిరిగి తమ క్లస్టర్ల పరిధిలోని మహిళా సంఘాల సభ్యులకు శిక్షణ ఇస్తారు. ఉపాధి హామీ పథకంతోపాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో జరుగుతున్న పొరపాట్లను గుర్తించడంతోపాటు క్షేత్రస్థాయిలో అవకతవకలకు అడ్డుకట్ట వేయడంపై వీరు మహిళలను చైతన్యపరుస్తారు. ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులకు అందేలా చూడటమే ఈ శిక్షణ ముఖ్యఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ఈ శిక్షణతో మహిళా సంఘాల సభ్యులు సామాజిక బాధ్యతతోపాటు నిధుల వినియోగంపై కూడా నిఘా పెట్టే అవకాశం ఉంటుందని ఆఫీసర్లు భావిస్తున్నారు.