- 4 వేల గ్రామాల్లో మహిళా భవనాల శంకుస్థాపనకు ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 25 నుంచి 31 వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, జీవనోపాధి కార్యక్రమాలు, ఆర్థిక స్వావలంబన చర్యలు ప్రజలకు స్పష్టంగా తెలియజేసేలా వారోత్సవాల కార్యక్రమాలు ఉండాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖలపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇందులో స్పెషల్ సీఎస్ దానకిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్, సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా తదితర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రతిరోజు భిన్న రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలను చాటి చెప్పేలా షెడ్యుల్ రూపొందించాలన్నారు. కనీసం 4 వేల గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మహిళా సంఘాల సభ్యుల విజయగాథలను ప్రజల ముందుకు తీసుకురావాలని, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా సాధించిన ఆర్థిక పురోగతి, ఉపాధి అవకాశాలు, మహిళల నాయకత్వ వికాసం, సామాజిక మార్పు వంటి అంశాలను ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సీఎం చేతుల మీదుగా మహిళా సాధికారత, మహిళా విజయాల ఆవిష్కరణ ఉంటుందన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల పురోగతిని మంత్రి సమీక్షించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, వ్యవసాయ, అనుబంధ, వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి, వ్యాపార అవకాశాల కల్పనకు సంబంధించిన కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని సూచించారు. మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
