హైదరాబాద్, వెలుగు : ప్రస్తుతం రాష్ర్టంలో కాంగ్రెస్హవా కొనసాగుతున్నదని, 70కిపైగా ఎమ్మెల్యే సీట్లను గెలుస్తామని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సరైన పాలనలేదని, అవినీతి, అరాచకాలు రాజ్యమేలుతున్నాయని ఫైర్ అయ్యారు. దేశంలోనే భారీ బహిరంగసభ విజయభేరిని హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఉత్తమ్ తెలిపారు.
‘తెలంగాణ తల్లి సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, పీసీసీ చీఫ్‌లు ఆ సభకు వస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులంతా తుక్కుగూడలోని సభా ప్రాంగణానికి తరలిరావాలి’ అని ఉత్తమ్ పిలుపునిచ్చారు. గురువారం గాంధీభవన్‌లో స్ట్రాటజీ కమిటీ మీటింగ్నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 130 ఏండ్ల కాంగ్రెస్ చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలను హైకమాండ్ నిర్వహిస్తున్నదని చెప్పారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని దేశంలో కలిపి 75 ఏండ్లవుతున్న సందర్భంగా ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు.
ఐదు గ్యారెంటీలను ప్రకటిస్తం
విజయభేరి సభలో సోనియా గాంధీ ఐదు గ్యారెంటీలను ప్రకటిస్తారని ఉత్తమ్ వెల్లడించారు. హామీలను అమలు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ గౌరవంగా భావిస్తుందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, విద్యా హక్కు చట్టం, హిమాచల్ ప్రదేశ్‌లో ఓల్డ్ పెన్షన్ స్కీం వంటి వాటిని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీనేనన్నారు. కర్నాటకలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రకటించిన ఐదు గ్యారెంటీలను అమలు చేసి చూపించామన్నారు.
ఇంటింటికీ గ్యారెంటీ కార్డ్: ఠాక్రే
ఇంటింటికీ గ్యారెంటీ కార్డ్‌ను అందజేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే తెలిపారు. సీడబ్ల్యూసీ సమావేశాల ద్వారా దేశానికి మంచి సందేశం అందనుందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై తమ సభను అడ్డుకునే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన వ్యూహాలను తయారు చేస్తామని స్ట్రాటజీ కమిటీ చైర్మన్ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆ స్ట్రాటజీపై పది రోజుల్లో నివేదికను ఇస్తామన్నారు.