కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తం : టీజేఎస్ చీఫ్ కోదండరాం

కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తం : టీజేఎస్ చీఫ్ కోదండరాం

భూపాలపల్లి రూరల్, వెలుగు :  కాంగ్రెస్ గెలుపు కోసం తమ పార్టీ కృషి చేస్తుందని టీజేఎస్ చీఫ్​ కోదండరాం తెలిపారు. అమరుల త్యాగాలు, సకల జనుల పోరాటాలతో సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్  దోచుకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూపాలపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు, కాంగ్రెస్  నేత రాంనారాయణ రెడ్డితో కలిసి కోదండరాం మాట్లాడారు. బీఆర్ఎస్  నేతలు భూకబ్జాలు, వనరుల దోపిడీకి పాల్పడ్డారని ఆయన విమర్శించారు.

ఆ పార్టీ పాలకులకు సంపాదన మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారం మీద లేదని ఆయన మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్  నెరవేర్చలేదన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. అనంతరం టీజేఎస్ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామర గట్టయ్య, టీజేఎస్  జిల్లా కన్వీనర్  రత్నం కిరణ్, కాంగ్రెస్  పార్టీ అర్బన్ అధ్యక్షుడు దేవన్  ఈ సమావేశంలో పాల్గొన్నారు.