ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి పనిచేస్తా : కడియం శ్రీహరి

ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి పనిచేస్తా : కడియం శ్రీహరి

యాదగిరిగుట్ట, వెలుగు : సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు అందరినీ కలుపుకుని పనిచేస్తామని మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజయ్య కూడా కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఇప్పటికే చెప్పారని గుర్తుచేశారు. నారసింహుడి ఆశీస్సులతో కచ్చితంగా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా గెలిచి మళ్లీ స్వామివారి దర్శనానికి వస్తానని కడియం ధీమా వ్యక్తం చేశారు.  బుధవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఆయన.. గర్భగుడిలో స్వయంభూ నారసింహుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు.. 35 ఏండ్లుగా అవినీతి ఆరోపణలు లేకుండా నిజాయతీగా పనిచేస్తున్నానని, ప్రతిపక్ష నాయకులు తనపై ఆరోపణలు చేసే అవకాశం కూడా ఇవ్వకుండా మచ్చలేని రాజకీయాలు చేస్తున్నానని చెప్పారు. ప్రజలంతా మంచిగుండాలే, కేసీఆర్ ముచ్చటగా మూడోసారి సీఎం కావాలని స్వామివారిని ప్రార్థించానని తెలిపారు.  కేసీఆర్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలు  చిత్తశుద్ధి ఉంటే.. ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న స్కీంలను ఇంప్లిమెంట్ చేసి మాట్లాడాలని సవాల్ విసిరారు. 

కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు గడ్డమీది రవీందర్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్ గౌడ్, మండల కార్యదర్శి శిఖ శ్రీనివాస్ గౌడ్, జిల్లా నాయకుడు పాండవుల భాస్కర్ గౌడ్, మాసాయిపేట గ్రామశాఖ అధ్యక్షుడు గుణగంటి బాబురావు గౌడ్, మండల నాయకులు ఉన్నారు.