- పరస్పర సహకారంతో కావాల్సిన అనుమతులు, నిధులు సాధించుకుంటం
- మా రాజకీయాల కోసం డెవలప్‌మెంట్‌ను పణంగా పెట్టలేం..
- కేంద్రంతో సఖ్యంగా ఉండడం వల్లే పలు ప్రాజెక్టుల్లో పురోగతి
- కాంగ్రెస్‌ది కలుపుకొనిపోయే గుణం.. బీజేపీది విభజన రాజకీయం
- మోదీ.. ముస్లింలు, మావోయిస్టులు అంటూ ప్రజల్ని విభజించి మాట్లాడిండు
- వారు ఈ దేశ ప్రజలు కాదా?
- విదేశీ విధానంలో కేంద్రం పూర్తిగా విఫలం
- ప్రధాని స్థాయిలో ప్రజలపై
- ఆంక్షలు విధించడం దారుణం
- తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర సీఎంకు లేఖ రాసినం..
- స్పందించేలా చూడాలని ప్రధానికీ విజ్ఞప్తి చేశామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కేంద్రంతో తాము కలిసి పనిచేసేది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని, పరస్పర సహకారంతో తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు సాధించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి లక్ష్యాల కోసం కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధమని తాను సీఎం హోదాలో చెప్పానని, దానిని ఆయన ప్రధాని హోదాలో ఆహ్వానించారని, ఇందులో తప్పేముందని
ప్రశ్నించారు. తమ ప్రసంగాలు పూర్తిగా అభివృద్ధి కేంద్రంగా జరిగినవేనని వివరించారు.
‘‘రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం సహకారం అవసరం.. అందువల్ల మోదీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు మాకు ఎలాంటి పట్టింపులు లేవు.. అంతే తప్ప గత కేసీఆర్ ప్రభుత్వం లాగా స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ అభివృద్ధిని పణంగా పెట్టలేం’’ అని వ్యాఖ్యానించారు. అలాగని కాంగ్రెస్, బీజేపీ ఐడియాలజీలు ఎప్పటికీ కలవవని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ది అందిరినీ కలుపుకొనిపోయే సిద్ధాంతమైతే, బీజేపీది బ్రిటిష్ పాలకుల మాదిరి ‘విభజించు.. పాలించు..’ సిద్ధాంతమని పేర్కొన్నారు. హైదరాబాద్ వేదికగా ప్రధాని హోదాలో ముస్లింలు, మావోయిస్టులు అంటూ ప్రజల్ని మోదీ విభజించి మాట్లాడడమే ఇందుకు నిదర్శనమని సీఎం మండిపడ్డారు.
సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో రేవంత్‌రెడ్డి చిట్‌చాట్‌గా మాట్లాడారు. కేంద్రంతో సఖ్యంగా ఉండడం వల్లే ట్రిపుల్ ఆర్, మెట్రో విస్తరణ, కాకతీయ టెక్స్‌టైల్ పార్క్, డిఫెన్స్ ల్యాండ్స్, మూసీకి ఏడీబీ నిధులు, హైవేలకు అనుమతులులాంటి అంశాల్లో పురోగతి కనిపిస్తోందని వెల్లడించారు. గత కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పనులు ఆలస్యమయ్యాయని ఆరోపించారు. తాను రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడనని, సిస్టమాటిక్ గవర్నెన్స్ ఇస్తానని స్పష్టం చేశారు. అధికారం ఉంది కదా అని విచక్షణా రహితంగా ప్రవర్తించబోనని చెప్పారు. కాగా, ఫీజుల నియంత్రణపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి, నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు. ఇప్పటికే కేకే నేతృత్వంలోని కమిటీ విద్యాశాఖ కమిషన్ఇచ్చిన నివేదికను అధ్యయనం చేస్తోందని పేర్కొన్నారు.
- మోదీవి విభజన రాజకీయాలు..
బీజేపీని ‘బ్రిటిష్ జనతా పార్టీ’ అని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. విభజించి పాలించడం వారి సిద్ధాంతమని పేర్కొన్నారు. హైదరాబాద్ వేదికగా ప్రధాని హోదాలో ముస్లింలు, మావోయిస్టులు అంటూ ప్రజల్ని విభజించి మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు, మావోయిస్టులు, కమ్యూనిస్టులు ఈ దేశంలోని ప్రజలేనని, అందరికీ సమాన హక్కులు ఉంటాయని మోదీ గుర్తుంచుకోవాలన్నారు. తమ సిద్ధాంతాన్ని వ్యతిరేకించిన వారిని ఖతం చేయడం బీజేపీ విధానమని, ఒప్పించి జనజీవన స్రవంతిలో కలపడం కాంగ్రెస్ విధానమని సీఎం వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. మనుషులను చంపడం పరిష్కారం కాదని, దేశంలో ఐక్యత పెంచేలా ప్రధాని మాట్లాడాలని, విడదీసేలా కాదని హితవు పలికారు. ప్రతి సెక్షన్‌లో భిన్నమైన మనస్తత్వాలు ఉంటాయని, అందరినీ కలుపుకొని పోవడమే అసలైన రాజనీతి అని అభిప్రాయపడ్డారు. ప్రధాని హోదాలో అన్ని కులాలను, మతాలను గౌరవించాల్సిన బాధ్యత మోదీపై ఉందన్నారు. మావోయిస్టులను కేంద్రం హతమారుస్తుంటే తెలంగాణలో మాత్రం 818 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యేలా చేశామని, ఇది దేశంలోనే రికార్డని రేవంత్ తెలిపారు. బుల్లెట్ వద్దు.. బ్యాలెట్ ముద్దు అని కాంగ్రెస్ మొదటి నుంచీ చెబుతుందని, మావోయిస్టులు ప్రస్తుతం అదే దారిలోకి వచ్చారని చెప్పారు.
గణపతిలాంటి నేతలు జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం పిలుపునిచ్చారు. వారికి వైద్య, ఆర్థిక సాయం, ఉపాధి అందిస్తామన్నారు. తాము ఎన్‌కౌంటర్లను ప్రోత్సహించబోమన్నారు. రాజీవ్ గాంధీని చంపిన వారికి కూడా సోనియా గాంధీ క్షమాభిక్ష పెట్టారని, కాంగ్రెస్ ఎప్పుడూ మానవతా దృక్పథంతోనే ఆలోచిస్తుందని తెలిపారు. మావోయిస్టుల ఎజెండానే కాంగ్రెస్ ఎజెండా అని, తమ ప్రభుత్వం.. పేదలకు భూములు, ఇండ్లు ఇవ్వడం, రైతులకు మద్దతు ధర కల్పించడం, పేదలకు ఉపాధి చూపడం లాంటి చర్యలు తీసుకున్నందు వల్లే ఈ దేశంలో నక్సలిజం క్రమంగా తగ్గుముఖం పట్టిందన్నారు.
- విదేశీ విధానంలో కేంద్రం విఫలం..
విదేశీ విధానంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, ఎన్డీయే ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘‘బంగారం కొనొద్దు, పెట్రోల్, డీజిల్వాడొద్దు.. విమానాల్లో వెళ్లొద్దు..’’ అంటూ ప్రధాని చెప్పడం కేంద్రం వైఫల్యం కిందికే వస్తుందని చెప్పారు. కేంద్ర అసమర్థతకు కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. అనుభవరాహిత్యం, అహంకారం వల్లే దేశాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. వాస్తవానికి ఈ పరిస్థితిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరు నెలల క్రితమే హెచ్చరించారని, ఆ ఆర్థిక సంక్షోభం ఇప్పుడు నిజమవుతోందని సీఎం చెప్పారు. గాల్లో తిని, గాలిలో బతకండి అనేలా మోదీ మాటలు ఉన్నాయని.. సామాన్యుడి కష్టాలు కేంద్రానికి పట్టడం లేదని విమర్శించారు.
- ఈ సీజన్ నుంచే పంటమార్పిడి
రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం రేవంత్ తెలిపారు. పెద్ద మొత్తంలో వరి ధాన్యం ఒకేసారి మార్కెట్లోకి వచ్చినందున వాటిని వెంటవెంటనే కొనుగోలు చేసి తరలించడంలో సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. అక్కడక్కడ అకాల వర్షాల వల్ల ధాన్యం తడుస్తున్నదని, కానీ తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. లారీలు, హమాలీల కొరత ఉన్నా ధాన్యం సేకరణ జరుగుతోందన్నారు. కాగా, ఈ సీజన్ నుంచే పంట మార్పిడిని ప్రోత్సహిస్తామని, తానే స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి రైతు వేదికల వద్ద అవగాహన సదస్సుల్లో పాల్గొంటానని ప్రకటించారు. ప్రత్యామ్నాయ పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.
అసెంబ్లీలోనూ ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన యూరియాను కేంద్రం సరఫరా చేయాలని, దానిని రైతులకు చేరవేసే బాధ్యత రాష్ట్రం తీసుకుంటుందని సీఎం వివరించారు. బీఆర్ఎస్ వాళ్లు అసహనంతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హ్యామ్ రోడ్లలో 90% మంది హరీశ్ బంధువులే ఎక్సెస్ టెండర్లు వేశారని, దీంతో ఆ విషయం ఆయనకు ముందే తెలిసిందన్నారు. మిగిలిన రాష్ట్రాల్లోకన్నా మన దగ్గరే తక్కువ ఎక్సెస్‌కు టెండర్లు వేశారని, అయినప్పటికీ ప్రభుత్వం 5% ఎక్సెస్పైనే వెళ్తున్న దని చెప్పారు. కాంట్రాక్టర్లతో కూర్చొని మాట్లాడాకే టెండర్లు ఫైనల్ చేస్తామని సీఎం స్పష్టం చేశారు.
- తుమ్మిడిహెట్టిపై ప్రధానికి లెటర్
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే మహారాష్ట్ర సీఎంకు లేఖ రాశామని సీఎం రేవంత్ తెలిపారు. ఆయన సానుకూలంగా నిర్ణయం తీసుకునేలా చూడాలని మోదీకి కూడా లెటర్ రాసినట్టు చెప్పారు. ఈ విషయంలో ప్రధాని మోదీ పెద్దరికం వహించి రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చాలని కోరారు. కోరిన తేదీకి మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోతే తదుపరి ప్రధానిని కలుస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు క్లియరెన్స్ కోసం కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా చొరవ తీసుకోవాలన్నారు. విభజన సమస్యలు, అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారంలో కేంద్రం చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
- మహిళా రిజర్వేషన్లకు అవసరం లేని అంశాలు ముడిపెట్టిన్రు
తమిళనాడులో గవర్నర్ తీరుపై సీఎం రేవంత్ స్పందించారు. బలనిరూపణ జరగాల్సింది అసెంబ్లీలో తప్ప లోక్ భవన్‌లో కాదని ఎద్దేవా చేశారు. అస్సాంలో జరిగిన డీలిమిటేషన్ బీజేపీకి అనుకూలంగా ఉందని, అక్కడ ఒక ఎంపీకి 10.50 లక్షల మెజార్టీ వచ్చిందన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలుపై కేంద్ర వైఖరిని రేవంత్ తప్పుబట్టారు. అవసరం లేని అంశాలను మహిళా రిజర్వేషన్లకు ముడిపెట్టి కేంద్రం కాలయాపన చేస్తోందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే మహిళా రిజర్వేషన్లు అమలు చేయవచ్చని, నియోజకవర్గాల పునర్విభజన వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని తెలిపారు.
సీట్ల సంఖ్య పెంపునకు 50 శాతం ప్రోరేటా అనేదానికి ఎలాంటి శాస్త్రీయత లేదన్నారు. ఇది చిన్న రాష్ట్రాల ఉనికిని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద రాష్ట్రాల్లోనే జనాభా ప్రాతిపదకన లోకసభ సీట్ల సంఖ్యను నిర్ణయించారని, కేంద్రపాలిత ప్రాంతాలు, యూటీలకుఈ నిబంధన లేదన్నారు. అందువల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పెంచేందుకు తాను జీఎస్డీపీని ఆధారం చేసుకోవాలని సూచించినట్టు సీఎం వివరించారు. ఇక సీట్ల సంఖ్య పెంపునకు.. ఇప్పుడున్న సీట్ల పరిధిలు మార్చుకునే డీలిమిటేషన్‌కు సంబంధమే లేదన్నారు. ఈ రెండు కూడా వేర్వురు అంశాలని పేర్కొన్నారు. ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తే నియోజకవర్గాల విభజన గంటల్లో పూర్తి చేయవచ్చన్నారు. కమిషన్వేస్తే 3 నెలలు పడుతుందన్నారు. 2029లోనే జమిలి ఎన్నికలు వస్తాయని తాను ఇప్పటికీ భావిస్తున్నట్టు చెప్పారు.
