నాలుగున్నర ఏండ్లుగా సాగుతున్న పనులు

నాలుగున్నర ఏండ్లుగా సాగుతున్న పనులు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా ఏర్పడి దసరా నాటికి ఆరేండ్లు కావస్తున్నా కొత్త కలెక్టరేట్​ తుది రూపుదిద్దుకోలేదు. నస్పూర్​లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​ పనులు నాలుగున్నర ఏండ్లు అవుతున్నా ఇంకా కొలిక్కి రాలేదు. కాంట్రాక్టర్​కు సకాలంలో బిల్లు రాకపోవడం, కొవిడ్​ లాక్​డౌన్ ఎఫెక్ట్​, భూవివాదాల కారణంగా ఆగుతూ సా...గుతున్నాయి. దీంతో ఎప్పటికప్పుడు గడువును పెంచుతూ పోతున్నారు. ఇప్పటికే మూడుసార్లు గడువు పొడిగించిన అధికారులు తాజాగా వచ్చే ఏడాది మార్చి డెడ్​లైన్​ విధించారు. ఇప్పటికైనా పనులు వేగవంతం చేయకపోతే ఈ గడువులోపు కూడా కంప్లీట్​ కావడం అనుమానమే. చుట్టుపక్కల జిల్లాలో స్పీడ్​గా నిర్మాణాలు పూర్తి చేసుకొని సీఎం కేసీఆర్​ చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరుపుకుంటుంటే... జిల్లాలో మాత్రం ప్రోగ్రెస్​ లేకపోవడంతో అధికారుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి.  నాలుగున్నర సంవత్సరాలుగా...  ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​కు భూమి కేటాయింపు నుంచే ఆటంకాలు ఎదురయ్యాయి. ముందుగా గోదావరి ఒడ్డునున్న భూదాన్​ భూములను ఎంపిక చేశారు. అక్కడి సాయిల్​ భారీ కట్టడాలకు అనుకూలంగా లేదని ఆర్​అండ్​బీ ఆఫీసర్లు రిపోర్ట్​ఇవ్వడంతో విరమించుకున్నారు. తర్జనభర్జనల తర్వాత చివరకు నస్పూర్​ మున్సిపాలిటీ పరిధిలోని సర్వేనంబర్​ 42లో 26.27 ఎకరాలను కేటాయించారు. స్థలం ఎంపికలో స్పష్టత లేకపోవడంతోనే ఏడాదికి పైగా టైమ్​ వృథా అయ్యింది. ఎట్టకేలకు 2018 ఫిబ్రవరి 27న సీఎం కేసీఆర్​ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఇప్పటికి నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా జిల్లా ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. 

పూర్​ ప్రోగ్రెస్​.... 

 దాదాపు 50 డిపార్ట్​మెంట్లకు చెందిన గవర్నమెంట్​ ఆఫీసులన్నీ ఒకే దగ్గర ఉండేలా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్ల నిర్మాణాలకు పూనుకుంది. కలెక్టర్​, అడిషనల్​ కలెక్టర్​, ఇతర అధికారుల నివాసాల కోసం క్వార్టర్లు సైతం ఇదే సముదాయంలో నిర్మిస్తున్నారు. ఆయా బిల్డింగుల్లో స్లాబ్​లు, వాల్స్​ నిర్మాణాలతో పాటు 75 శాతం పనులు జరిగాయి. ఇంకా కీలకమైన ప్లాస్టరింగ్, ఫ్లోరింగ్​, సీలింగ్​, ఎలక్ర్టిఫికేషన్​ తదితర వర్క్స్​ నడుస్తున్నాయి. రూ.48.44 కోట్లతో చేపట్టిన పనుల్లో రూ.33.50 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ఎన్​హెచ్​ 63 నుంచి కలెక్టరేట్​ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. భూవివాదాల వల్ల ఈ పనులు లేట్​ అయ్యాయని, త్వరలోనే స్టార్ట్​ చేస్తామని ఆఫీసర్లు పేర్కొన్నారు.  

బిల్స్​ పెండింగ్​...  

ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​ నిర్మాణ పనులు లేట్​ కావడానికి ఫండ్స్​ కొరత కూడా కారణమని తెలుస్తోంది.కాంట్రాక్టర్​కు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో మధ్య మధ్యలో పనులు ఆపేస్తున్నారు. ప్రస్తుతం రూ.6 కోట్లకు పైగా బిల్స్​ పెండింగ్​ ఉన్నట్టు సమాచారం. అలాగే కొవిడ్​ లాక్​డౌన్​ ఎఫెక్ట్​ వల్ల కూడా పనులు కొంతకాలం ఆగిపోయాయి. కలెక్టరేట్​ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కలెక్టరేట్​ ఓ దగ్గర ఉండగా, జిల్లా ఆఫీసులు ఒక్కోటి ఒక్కో దగ్గర ఉన్నాయి. కొన్ని పట్టణంలో ఉండగా, మరికొన్ని శివారు ప్రాంతాల్లో నాలుగైదు కిలోమీటర్ల దూరంలో నిర్వహిస్తున్నారు. గ్రామాల నుంచి వచ్చే వారికి ఏ ఆఫీసు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. దీంతో నాలుగు ఆఫీసులకు తిరగాలంటే రోజంతా గడిచిపోతోంది. ఆఫీసుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.