బైడెన్ పాలనలో అమెరికా నాశనమవుతోంది : ట్రంప్

బైడెన్ పాలనలో అమెరికా నాశనమవుతోంది : ట్రంప్
  • అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
  • పూర్తిస్థాయిలో అణుయుద్ధం జరిగే అవకాశం ఉంది 
  • బైడెన్ పాలనలో అమెరికా నాశనమవుతోందని విమర్శ 

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బైడెన్ వ్యవహరిస్తున్న తీరు కారణంగా ప్రస్తుతం మూడో ప్రపంచ యుద్ధం జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయని యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ‘‘నమ్మండి. నమ్మకపోండి. పూర్తిస్థాయి అణ్వస్త్రాలతో మూడో ప్రపంచ యుద్ధం జరిగే సమయం ఎంతో దూరంలో లేదు” అని ఆయన కామెంట్ చేశారు. బైడెన్ ప్రభుత్వం అమెరికాను నాశనం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కు డబ్బులు చెల్లించి, తప్పుడు బిజినెస్ రికార్డులు చూపారన్న(హుష్ మనీ) కేసులో మంగళవారం అరెస్ట్ అయి, బెయిల్ పై విడుదలైన తర్వాత ఆయన ఫ్లోరిడాలోని తన రిసార్ట్ లో జరిగిన సభలో మాట్లాడారు. అణ్వాయుధాలను ప్రయోగిస్తామంటూ ప్రస్తుతం అనేక దేశాలు బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నాయని, తన హయాంలో ఏ దేశమూ ఇలాంటి ప్రకటనలు చేయలేదన్నారు. బైడెన్ పాలనలో దేశం ఇప్పుడు ప్రమాదంలో పడిందన్నారు. ‘‘మన ఎకానమీ పతనం అవుతోంది. ద్రవ్యోల్బణం కంట్రోల్ తప్పింది. యూఎస్ కరెన్సీ క్రాష్ అవుతున్నందున ఇక ఎంతోకాలం వరల్డ్ స్టాండర్డ్ గా అది కొనసాగలేదు. ఇదే జరిగితే 200 ఏండ్లలో అమెరికాకు అతిపెద్ద ఓటమి అవుతుంది” అని ట్రంప్ అన్నారు. ‘‘చైనాతో రష్యా చేతులు కలిపింది. ఇరాన్ తో సౌదీ అరేబియా జతకట్టింది. దీనిని మీరు నమ్మగలరా? చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా కలిసి విధ్వంసకర కూటమిగా మారాయి. నా హయాంలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు నేనే అమెరికా ప్రెసిడెంట్ గా ఉండి ఉంటే.. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసేది కాదు. అక్కడ ఇన్ని ప్రాణాలు పోయేవి కావు. అందమైన ఆ నగరాలన్నీ అలాగే నిలిచి ఉండేవి” అని ఆయన కామెంట్ చేశారు. అమెరికా చరిత్రలోనే ఐదుగురు చెత్త అధ్యక్షులను తీసుకున్నా.. వారందరి కన్నా బైడెన్ పాలనలోనే దేశం 
ఎక్కువగా నాశనం అయ్యిందన్నారు.

ట్రంప్​పై కేసు ఓడిన స్టార్మీ.. రూ.5 కోట్ల ఫైన్

ట్రంప్ పై పరువునష్టం కేసులో పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ ఓడిపోయారు. దీంతో మొత్తంగా ఆమె ట్రంప్ లాయర్లకు కోర్టు ఖర్చుల కింద 6 లక్షల డాలర్లు (రూ. 5 కోట్లు) చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. ట్రంప్ తో తన సంబంధంపై నోరు మెదపొద్దని ఓ వ్యక్తి బెదిరించాడంటూ2018లో స్టార్మీ ఆరోపించగా, అదంతా పచ్చి మోసం, అబద్ధమంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. దీంతో ట్రంప్ పై ఆమె పరువు నష్టం దావా వేశారు. అయితే, ట్రంప్ కామెంట్స్ చట్టప్రకారమే ఉన్నాయని, అందులో పరువునష్టం ఏమీలేదంటూ అదే ఏడాది ఫెడరల్ జడ్జి తీర్పు చెప్పారు. ట్రంప్ లాయర్లకు కోర్టు ఖర్చుల కింద 2.93 లక్షల డాలర్లు చెల్లించాలని ఆదేశించారు. ఆ తీర్పుపై స్టార్మీ అప్పీల్ కు వెళ్లగా కోర్టు మరోసారి ఆమెనే తప్పు పట్టింది. మరో 2.45 లక్షల డాలర్ల ఫైన్ వేసింది. ఈ తీర్పుపైనా ఆమె అప్పీల్ కు వెళ్లగా తాజాగా కాలిఫోర్నియాలోని 9వ యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్​అప్పీల్స్ కూడా ఆమెకు 1.21 లక్షల డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. దీంతో మొత్తంగా ఈ కేసులో స్టార్మీ నుంచి తమకు 6 లక్షల డాలర్లు (రూ.5 కోట్లు) రానున్నాయంటూ ట్రంప్ లాయర్, థిల్లాన్ లా గ్రూప్ సీనియర్ పార్ట్ నర్ హర్మీత్ 
కె. థిల్లాన్ హర్షం వ్యక్తంచేశారు.