వరల్డ్ కప్: ఇవాళ ఆసీస్  vs విండీస్

వరల్డ్ కప్: ఇవాళ ఆసీస్  vs విండీస్

నాటింగ్‌‌హామ్‌‌: పాత తరం పేస్‌‌ బౌలింగ్‌‌ మెరుపులను గుర్తుకు తెస్తూ.. వరల్డ్‌‌కప్‌‌లో అదిరిపోయే బోణీ అందుకున్న వెస్టిండీస్‌‌ మరో కీలక పోరుకు సిద్ధమైంది. గురువారం జరిగే లీగ్‌‌ మ్యాచ్‌‌లో బలమైన ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. సంధి దశను దాటి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న కరీబియన్లు.. తొలి మ్యాచ్‌‌లో పాకిస్థాన్‌‌ను ఓడించిన తీరు ప్రపంచ క్రికెట్‌‌లో ఒకప్పటి తమ ఆధిపత్యాన్ని మరోసారి గుర్తుకు తెచ్చింది. 1975 తొలి వరల్డ్‌‌కప్‌‌ ఫైనల్లో ఆండీ రాబర్ట్స్‌‌, మైకేల్‌‌ హోల్డింగ్‌‌, కొలిన్‌‌ క్రాఫ్ట్‌‌, జోయల్‌‌ గార్నర్‌‌ల పేస్‌‌ మెరుపులు.. థామస్‌‌, కోట్రెల్‌‌, రసేల్‌‌, హోల్డర్‌‌ రూపంలో మళ్లీ ఇన్నాళ్లకు కనిపించాయి. దీంతో విండీస్‌‌ ఆడే ప్రతి మ్యాచ్‌‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కంగారూలతో పోలిస్తే విండీస్‌‌ బ్యాటింగ్‌‌ బలహీనమే అయినా.. బౌలింగ్‌‌ అమ్ముల పొదిలో మాత్రం పదునైన పేస్‌‌ అస్త్రాలు ఇంకా మిగిలే ఉన్నాయి. కీమర్‌‌ రోచ్‌‌, షానన్‌‌ గాబ్రియెల్‌‌ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. కెరీర్‌‌లో చివరి వరల్డ్‌‌కప్‌‌ ఆడుతున్న హిట్టర్‌‌ క్రిస్‌‌గేల్‌‌పై భారీ అంచనాలు ఉన్నాయి. తొలి మ్యాచ్‌‌లో అర్ధసెంచరీతో ఆకట్టుకున్నా.. ఆసీస్‌‌పై ఈ యూనివర్స్‌‌ బాస్‌‌ చెలరేగడం అత్యంత అవశ్యం. హోప్‌‌, బ్రావో, పూరన్‌‌, హెట్‌‌మయర్‌‌ రాణిస్తే బ్యాటింగ్‌‌లో కరీబియన్లకు తిరుగుండదు. రసెల్‌‌ హిట్టింగ్‌‌ జట్టుకు అదనపు బలం.  క్వాలిఫయింగ్‌‌ టోర్నీ ద్వారా వరల్డ్‌‌కప్‌‌లోకి వచ్చినా.. తమదైన రోజున ఎంతటి ప్రత్యర్థినైనా ఓడించే సత్తా ఉన్న ఆటగాళ్లకు విండీస్‌‌ జట్టులో కొదువలేదు. ఓవరాల్‌‌గా తమకంటే పటిష్టంగా కనిపిస్తున్న ఆసీస్‌‌ను కంగారుపెడతారా? లేక కంగారుపడతారా? అన్నది చూడాలి. మరోవైపు పసికూన అఫ్గానిస్థాన్‌‌పై 7 వికెట్ల తేడాతో గెలిచి మెగా టోర్నీలో శుభారంభం చేసిన డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ ఆసీస్‌‌కు.. విండీస్‌‌ రూపంలో కఠిన పరీక్ష ఎదురుకాబోతున్నది. స్మిత్‌‌, వార్నర్‌‌ రాకతో బ్యాటింగ్‌‌ బలం బాగా పెరిగింది. థామస్‌‌ బౌన్సర్ల నుంచి వార్నర్‌‌కు ముప్పు పొంచి ఉంది. ఆరంభంలో ఫించ్‌‌, వార్నర్‌‌ ఇచ్చే బలమైన ఆరంభంపైనే కంగారూల భారీ స్కోరు ఆధారపడి ఉంది. మిడిలార్డర్‌‌లో ఖవాజ, స్మిత్‌‌, మ్యాక్స్‌‌వెల్‌‌ మెరుపులు మెరిపిస్తే భారీ స్కోరు ఖాయం. ఆల్‌‌రౌండర్‌‌గా స్టొయినిస్‌‌ కీలకం కానున్నాడు.