
ఏఐ టెక్నాలజీ అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ఏఐతో ఎన్నో పనులు చేస్తున్నా.. వంట చేయడం మాత్రం చాలా కష్టం అనుకునేవాళ్లం. ఎందుకంటే.. వంట అనేది మనసుపెట్టి చేయాల్సిన పని. వాసన, రుచి, రంగుని పరిశీలిస్తూ చేయాలి. కానీ.. అవన్నీ చేయలేకపోయినా అద్భుతంగా వంట చేయగలను అంటోంది ఏఐ.
త్వరలోనే దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫాకి దగ్గర్లో ‘వూహూ’ అనే ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచంలో ఏఐ చెఫ్‌తో నడిచే మొట్టమొదటి రెస్టారెంట్ ఇది. దీన్ని వచ్చే సెప్టెంబర్‌లో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రెస్టారెంట్‌లో పనిచేసే ఏఐ చెఫ్‌కి ఏఐ + మ్యాన్‌ని కలిపి ‘ఐమాన్’(Aiman) అని పేరుపెట్టారు. ఇది హ్యూమనాయిడ్ రోబో కాదు. మనుషులతో కలిసి వంట చేయడానికి రూపొందించిన అత్యాధునిక ఏఐ వ్యవస్థ. కానీ.. చాలా తెలివైనది. అధునాతన సాఫ్ట్‌వేర్ వ్యవస్థతో పనిచేసే డిజిటల్ కలినరీ మాస్టర్‌మైండ్. ప్రపంచ వంటకాలు, శాస్త్రీయ వంట పద్ధతులు, టేస్ట్ ప్రొఫైల్స్, కస్టమర్ ఫీడ్‌బ్యాక్ అల్గారిథమ్స్ లాంటివాటిపై ఐమాన్‌ని ట్రైన్ చేస్తున్నారు.
స్పెషల్ మెనూ
వూహూలో చెఫ్ ఐమాన్ ఈజీగా చేయగలిగే కొన్ని ప్రత్యేకమైన వంటకాలను డిజైన్ చేస్తున్నారు. మెనూలో ఆసియా–ఫ్యూజన్ రుచులతోపాటు జపనీస్, కొరియన్, థాయ్, మిడిల్ ఈస్ట్రన్ వంటకాలు ఉంటాయి. అంటే మిసో– మ్యారినేటెడ్ మీట్స్ నుంచి సూషి, సెవిచెస్, రోబాటా-గ్రిల్డ్ స్కేవర్స్ వరకు అన్నీ ఉంటాయి. చెఫ్ ఐమాన్ రకరకాల మాలిక్యులర్ కాక్‌టెయిల్స్‌ని కూడా తయారుచేస్తుంది.
భయం అక్కర్లేదు!
ఈ ఏఐ మానవ చెఫ్‌ల స్థానాన్ని పూర్తిగా భర్తీ చేస్తుందనే భయం అక్కర్లేదు. ఎందుకంటే.. చెఫ్‌లకు సాయంగా ఉండేందుకు, ఫుడ్ టేస్ట్‌ని మరింత పెంచేందుకే దీన్ని తయారుచేశారు. చెఫ్ సాయం లేకుండా ఇది అన్ని రకాల వంటలు చేయలేదు. అయితే.. చెఫ్ ఐమాన్ తెలివైంది మాత్రమే కాదు.. బాధ్యత గల ఏఐ. పర్యావరణ స్పృహతో పనిచేస్తుంది. దీనికి కిచెన్‌లో మిగిలిపోయిన ఫుడ్ వేస్ట్‌ని తిరిగి ఎలా ఉపయోగించాలో కూడా బాగా తెలుసు.