
భారతదేశంలోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.1.02 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ మేరకు వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్‌లో 26 దేశీయ, విదేశీ సంస్థలతో కేంద్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నది. ఈ ఒప్పందాలు కార్యరూపం దాల్చాక 64,000 మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు, 10 లక్షల మందికి పైగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా. పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించిన ప్రముఖ కంపెనీల్లో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్, కోకా–కోలా, అమూల్, లూలు గ్రూప్, నెస్లే ఇండియా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, పతంజలి ఫుడ్స్, డాబర్ ఇండియా వంటివి ఉన్నాయి.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగం
ఈ రంగంలో వ్యవసాయ ఉత్పత్తులను ఆహార పదార్థాలుగా మార్చే ప్రక్రియలు ఉంటాయి. పాలు, పండ్లు, కూరగాయలు, మాంసం వంటివి స్నాక్స్, జ్యూస్‌లు, ప్యాక్ చేసి ఆహారాలుగా మార్పుచేసి నిల్వ చేయడం ఈ రంగంలో భాగం. ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవసాయ రంగాన్ని, పరిశ్రమలను అనుసంధానిస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెరగడం వల్ల వ్యవసాయం నుంచి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, రవాణా, మార్కెటింగ్ వరకు అనేక దశల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్
ఈ సమ్మిట్‌ను భారత ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి నిర్వహిస్తోంది. భారతదేశాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ప్రపంచ కేంద్రంగా మార్చడమే వరల్డ్ ఫుడ్ ఇండియా సమ్మిట్ ప్రధాన లక్ష్యం.
అవగాహన ఒప్పందం
ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీల మధ్య కుదిరిన ఒక అధికారిక ఒప్పందం. ఇందులో ప్రతి పార్టీ ఉద్దేశాలు ఉద్దేశాలు, లక్ష్యాలు, బాధ్యతలు స్పష్టంగా పేర్కొంటారు.