హైదరాబాద్ మెట్రోలో ఇంత డబ్బు తీసుకెళ్లకూడదా..? జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్లో ఏమైందంటే..

హైదరాబాద్ మెట్రోలో ఇంత డబ్బు తీసుకెళ్లకూడదా..? జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్లో ఏమైందంటే..

హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్లో ఒక ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్ లోపలికి వెళ్లేందుకు ఒక వ్యక్తికి అనుమతి దొరకలేదు. అతని దగ్గర మూడున్నర లక్షల డబ్బు ఉన్న విషయం సెక్యూరిటీ సిబ్బంది తనిఖీల్లో తెలియడమే ఇందుకు కారణం.

బుధవారం ఒక వ్యక్తి మెట్రో రైలులో ప్రయాణించేందుకు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్కు వెళ్లాడు. టికెట్ తీసుకుని ప్లాట్ ఫాం దగ్గరకు వెళ్లే లోపు యధావిధిగా సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేశారు. అతని దగ్గర ఉన్న బ్యాగులో మూడున్నర లక్షలు ఉన్నట్లు స్క్రీనింగ్లో తేలింది. దీంతో మెట్రో రైలులో ప్రయాణించేందుకు అతనిని సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. 

ఆర్బీఐ రూల్స్ ప్రకారం.. ఒక ప్రయాణికుడు 2 లక్షలకు మించి డబ్బుతో మెట్రో రైళ్లలో ప్రయాణించకూడదు. ఈ విషయం తెలియని సదరు ప్రయాణికుడు 3.5 లక్షల డబ్బుతో మెట్రో స్టేషన్కు వెళ్లడంతో రూల్ గురించి వివరించి అతనిని అక్కడ నుంచి పంపించేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకునే ఎక్కువ మొత్తంలో డబ్బును తరలించే అవకాశం ఇవ్వడం లేదని మెట్రో సిబ్బంది చెప్పారు. మెట్రో ప్రయాణికులు రూల్స్ ప్రకారం నడుచుకుని తమకు సహకరించాలని.. ప్రశాంతమైన ప్రయాణం చేయాలని మెట్రో అధికారులు విజ్ఞప్తి చేశారు.