
దసరా పండుగలోని ఖగోళ శాస్త్రాన్ని ప్రముఖ వైదిక మత పరిశోధకులు పొలిశెట్టి బ్రదర్స్ అద్భుతంగా వివరించారు. తూర్పున సింహరాశి ఉదయించే రోజుల్లో మహిష తారలు ఆకాశ మధ్యమంలో రెండు కొమ్ముల్ని తూర్పు దిక్కుకు చాచుకుని ఉన్నట్టుగా దర్పంగా ఉంటాయి. అదే మహిషాసురుడి యుద్ధ సన్నద్ధత.
క్రమేపి రోజురోజుకూ సింహం.. కన్య ఆకాశంలోకి ఎగబాకుతుంటే మహిష తారలు పశ్చిమానికి వాలిపోవడం ఆరంభిస్తాయి. పది రోజులకు సింహ, కన్యారాశులు బాగా పైకి వస్తాయి. సూర్యుడు సింహం నుంచి కన్యలో చేరతాడు. మహిష తారలు వాలిపోతాయి. అదే జగన్మాత–మహిషాసురుల యుద్ధం. మహిషుడి మరణం దుర్గామాత విజయం.
దసరా రోజుల సంకేతం. ఇది ఖగోళంలో జరిగిన నక్షత్ర సముదాయాల గతులను గుర్తు పెట్టుకోవడం కూడా తెలియజేస్తోంది. ఖగోళంలో జరిగే ఇలాంటి గ్రహగతులు విజ్ఞానం మన పండుగలకు అనుసంధానం చేసి ఆ సంఘటన గుర్తుపెట్టుకొనేటట్టు మన పూర్వీకులు చేశారు. ఆకాశంలో రోహిణి నక్షాత్రాలను మరో రెండు నక్షత్రాలతో కలిపి వృషభ శిరస్సుగా చిత్రిస్తారు మన జ్యోతిషకర్తలు.
ఇదే వృషభ శిరస్సును మహిషుని శిరస్సుగా వర్ణించారు కొందరు రుషులు. వృషభం అనగా ఎద్దు. మహిషం అనగా దున్నపోతు. మహిషాసురుడే ఆ దున్నపోతు. ఆకాశంలో సింహరాశి, కన్యారాశి అనే నక్షత్రాల గుంపులున్నాయని మనకు తెలుసు. ఆ సింహరాశియే అమ్మవారి సింహం. ఆ తర్వాత ఉదయించే కన్యారాశియే శ్రీ దుర్గామాత.
శమీ పూజ
దుర్గాష్టమి నుంచి మొదలుకొని విజయ దశమి వరకు ఆయుధ సంపత్తిని సిద్ధం చేసుకుని పూజలు చేస్తారు. ఇటీవల కమ్మరులు, వడ్రంగులు, వివిధ పారిశ్రామిక వాడల్లోని యంత్రాలవారు, బస్సులు నడిపేవారు కూడా తమతమ పరికరాలను కడిగి పూజలు చేస్తున్నారు. విజయదశమినాడు అపరాజితా పూజ, సీమోల్లంఘనం, శమీపూజ చేయాలి. దేశాంతరం వెళ్లేవారు ఈ రోజు బయల్దేరాలి.
అపరాహ్ణ సమయంలో గ్రామానికి ఈశాన్య దిక్కుకు వెళ్లి అక్కడ శుచియైన స్థలాన్ని అలికి చందన, కుంకుమలతో అష్టదళపద్మం వేసి పూజానమస్కారాలు చేయాలి. ఆ తర్వాత గ్రామప్రజలంతా గ్రామపొలిమేరదాటి ఈశాన్య దిక్కున ఉన్న శమీవృక్షం వద్దకు వెళ్లి పూజించాలి. ఈ సీమోల్లంఘనం శమీపూజపూజ తర్వాతనైనా, మొదటనైనా చేయాలి. స్వస్తివాచన పూర్వకంగా శమీవృక్షాన్ని పూజించాలి. శమీవృక్షం దగ్గర అందరూ నిలబడి ప్రార్థన చేయాలి. ఓ శమీ. నీవు పాపం శమింపచేస్తావు. ఎర్రటి ముళ్లుగలదానవు. అర్జునుడి బాణాలను ధరించినదానవు. రామునికి ప్రియమైన మాటలు పలికినదానవు. శ్రీరామపూజితా.. నేను జరిపే యాత్ర నిర్విఘ్నంగా జరిగేటట్టు అనుగ్రహించు అని శమీ వృక్ష ప్రార్థనం చేస్తాం.
పాలపిట్ట దర్శనం
అపరాజితపూజ తర్వాత కాటుకపిట్ట, పాలపిట్ట దర్శనం చేస్తారు. మనకు పంచయజ్ఞాల్లో భూతయజ్ఞం ఒకటి. ఓ మానవుడా.. ఈ సృష్టిలో నీతోపాటు ఉన్న పశుపక్ష్యాదులను కూడా గమనించు అనేది భూతయజ్ఞం. మనచుట్టూ ఉండే పశుపక్షులను ప్రేమిస్తేనే మానవజీవితానికి పరమార్థం. ఏడాదికి ఒక్కసారైనా ఆ అరుదైన పాలపిట్ట దర్శనం చేస్తే పక్షుల విలువ మనకు తెలుస్తుంది. ఈ పక్షి ప్రత్యేకించి వర్ష రుతువు తర్వాతనే బయటకు వస్తుంది. ఎందుకంటే నీరు దానికి సరిపడదు. వర్ష రుతువు పూర్తయిందని అది మనకు తెలియజేస్తుంది. కొన్ని జంతువులకు, పక్షులకు ఇలాంటి పరిజ్ఞానం ఉంటుంది. ఇప్పటికీ భూకంపాలు, సునామీలు గుర్తించే జంతువులు, పక్షులు ఉన్నాయని పరిశోధకులు అంటారు. కొందరు ఈ పక్షి దర్శనంలో గరుత్మంతుడిని కూడా చేర్చారు. ఎందుకంటే గరుడ దర్శనం జయిష్ణువైన మహావీరుని దర్శనంగా కొందరు భావిస్తారు. తన తల్లి దాస్య శృంఖలాలను తన యుక్తితో, శక్తితో తుంచేసిన ధీశాలి. అలాంటి గరుత్మంతునికి ప్రతీకగా ఉన్న గరుడు పక్షులను దర్శించాలనుకుంటారు.
దసరా పద్యాలు
పూర్వం తెలంగాణ, ఆంధ్ర, సీమ ప్రాంతాల్లో ఓ గొప్ప సంప్రదాయం ఉండేది. అప్పుడు ప్రభుత్వ బడులకన్నా ‘కానిగిబడులు’ (ప్రైవేటు పాఠశాలలు) ఎక్కువ ఉండేవి. ఊర్లో విద్యావంతుడి చేత అందరికీ అక్షరాలు, పెద్ద బాలశిక్ష, గుణింతాలు, శతకాలు నేర్పించేవారు. ఆ గురువుకు జీతం ఇచ్చేందుకు దసరా సందర్భంలో విద్యార్థులంతా ధనికుల వద్దకు చిన్న విల్లుల ఆకారంలో వస్తువులు పట్టుకుని, వేషధారణ చేసేవాళ్లు. గురుదక్షిణ కోసం దసరా పద్యాలు చదివేవారు. శ్రీమంతులను మెప్పించి గురుదక్షిణ వసూలు చేసేవారు. బడిపిల్లలు దసరా సెలవుల్లో విల్లంబులు ధరించి, గిలకలుపట్టి, ఇంటింటికీ తిరిగి ‘గురుదక్షిణ’ కోరడమే ఉపాధ్యాయ వారోత్సవ కార్యక్రమం. విద్యార్థులు చేతుల్లో రంగు బాణాలు ధరించి ఇంటింటికీ తిరిగి తమ ఆయుధాలకే నివేదన తెమ్మంటూ, పప్పు బెల్లాలిమ్మంటూ, తమను విద్యావంతులను చేస్తున్న గురువులకు కట్నకానుకలను ఇమ్మంటూ అదే పాటగా, ఆటగా సందడితో జయజయధ్వానాలు చేసేవారు. ఆ ఆచారం ఇప్పుడు కనుమరుగైంది.
విజయ ముహూర్తం
మొత్తానికి దసరా పర్వదినం అన్నివర్గాలవారికి సమాజంలో బాధ్యతను కల్పిస్తుంది. ప్రజలకు తమ వ్యక్తిగత జీవితం ఎంత ముఖ్యమో సమాజం, దేశం కూడా అంతే ముఖ్యం. సంవత్సరానికి ఒకసారి ఎక్కడి ప్రజలు అక్కడే తమ గ్రామస్తులందరితోపాటు ఊరేగింపు, బలప్రదర్శన జరిపి ఐకమత్యం తీసుకువస్తారు. తద్వారా వ్యక్తి సమాజం, దేశం. ఈ మూడు సురక్షితంగా ఉంటాయి. అవి సురక్షితంగా ఉంటేనే దేశ ప్రజలు క్షేమంగా ఉంటారు. అమ్మవారి దివ్యశక్తులు విద్య, ధన, బలరూపంలో ఉంటాయి. అవి సర్వజనులకూ అవసరం కాబట్టి వాటిని ఉపాసిస్తారు. ఆ ఉపాసన ప్రజల్లో కలిగించడానికే విజయ దశమి. ఈ రోజు ముహూర్తం విజయ ముహూర్తం. దసరా పండుగ రోజు జరిగే కార్యక్రమం అంతా శరన్నవరాత్రులతో అనుసంధానమై ఉంటుంది.
- డాక్టర్.
పి. భాస్కర యోగి