పండగ పూట పెను విషాదం.. దుర్గమ్మ నిమజ్జనానికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. 11 మంది మృతి

పండగ పూట పెను విషాదం.. దుర్గమ్మ నిమజ్జనానికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. 11 మంది మృతి

ఖాండ్వా: మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో దసరా పండుగ రోజునే పెద్ద ప్రమాదం జరిగింది. నవరాత్రులను పురస్కరించుకుని నిమజ్జనం కోసం దుర్గమ్మ విగ్రహాన్ని తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీ వంతెన మీద నుంచి చంబల్ నదిలో పడిపోయింది. పంధాన పోలీస్ స్టేషన్ పరిధిలోని జామ్లి గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పంధాన కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గురువారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే కలెక్టర్, జిల్లా ఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

నిమజ్జనం కోసం వివిధ గ్రామాల నుంచి దుర్గా మాత విగ్రహాలను తీసుకెళ్తున్న ట్రాక్టర్‌పై భక్తులు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ ట్రాలీ నదిలో పడిపోవడంతో అందులో ఉన్న దాదాపు 20 నుంచి 25 మంది మునిగిపోయారు. ఈ వార్త తెలియగానే గ్రామం దిగ్భ్రాంతికి లోనైంది. పంధాన పోలీస్ స్టేషన్ పోలీసులు, గ్రామస్తులు వెంటనే నదిపై కట్టిన వంతెన దగ్గరకు చేరుకున్నారు. ఈ ప్రమాదంలో పదకొండు మంది మరణించగా, ఇంకా చాలా మంది ఆచూకీ తెలియలేదు. చనిపోయిన వాళ్లలో ఎక్కువ మంది పిల్లలే ఉండటం మరింత శోచనీయం.

పంధాన పోలీస్ స్టేషన్ పరిధిలోని జామ్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. దసరా సందర్భంగా నిమజ్జనం కోసం దుర్గా మాత విగ్రహాన్ని నదికి తీసుకెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని.. డ్రైవర్ కల్వర్టుపై పార్క్ చేశాడు. ట్రాక్టర్ ట్రాలీ ఉన్నట్టుండి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది. 14 మంది గల్లంతయ్యారు, 11 మంది మరణించారు. చిన్నారుల మరణ వార్త విన్న వారి కుటుంబ సభ్యులు ఏడుస్తూ అక్కడికి చేరుకున్నారు.