
హైదరాబాద్: మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (73) అనారోగ్యంతో కన్నుమూశారు. బుధవారం రాత్రి (అక్టోబర్ 1, 2025) ఏఐజీ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డికి ఏఐజీలో చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆయన బుధవారం రాత్రి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అక్టోబర్ 4, 2025న సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో దామోదర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
ఖమ్మం జిల్లా లింగాలలో 1952 సెప్టెంబర్ 14న రాంరెడ్డి దామోదర్ రెడ్డి జన్మించారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఐటీ శాఖ మంత్రిగా దామోదర్ రెడ్డి సేవలందించారు.
తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల నుంచి దామోదర్ రెడ్డి.. శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదు సార్లు రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్తో మంచి సంబంధాలను ఆయన కొనసాగించారు. స్వరాష్ట్ర సాధనకై ప్రత్యేక తెలంగాణ గళం బలంగా వినిపించిన కాంగ్రెస్ నేతల్లో రాంరెడ్డి దామోదర్ రెడ్డి కూడా ఒకరు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇక లేరనే వార్త ఆయన అనుచరులను కలచివేసింది.