
- షెడ్యూల్డ్ ఏరియా కావడంతో సర్పంచ్ పదవి,
- నాలుగు వార్డులు ఎస్టీకి రిజర్వ్
- ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేకపోవడంతో
- ఆ పదవులన్నీ ఖాళీయే..
- ఉపసర్పంచ్‌గా ఎన్నికైన వ్యక్తికే సర్పంచ్ బాధ్యతలు
ఖమ్మం, వెలుగు : షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించిన ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నూకలంపాడు గ్రామ పంచాయతీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీలకు కేటాయించినప్పటికీ... ఊర్లో ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేకపోవడంతో 20 ఏండ్లుగా ఉపసర్పంచ్‌గా గెలిచిన వ్యక్తికే సర్పంచ్ అధికారాలు అప్పగిస్తున్నారు. గత నాలుగు టర్మ్‌లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండగా.. ఈ సారి కూడా సేమ్ సీన్ రిపీట్ కానుంది.
వెయ్యికి పైగా ఓటర్లు
నూకలంపాడు గ్రామంలో మొత్తం 1,063 మంది ఓటర్లు, ఎనిమిది వార్డులు ఉన్నాయి. ఈ గ్రామం షెడ్యూల్డ్ ఏరియా కింద ఉండడంతో సర్పంచ్ పదవితో పాటు నాలుగు వార్డులను ఎస్టీలకు రిజర్వ్ చేయగా.. మిగిలిన నాలుగు వార్డులను జనరల్‌గా నిర్ణయించారు. అయితే గ్రామంలో ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేకపోవడంతో 2004 నుంచి అక్కడ సర్పంచ్ పదవితో పాటు నాలుగు వార్డులు ఖాళీగానే ఉంటున్నాయి. ఈ క్రమంలో జనరల్‌కు కేటాయించిన నాలుగు వార్డుల్లో ఎన్నికైన వారి నుంచే ఒకరిని ఉపసర్పంచ్‌గా ఎన్నుకుంటూ సర్పంచ్ బాధ్యతలు అప్పగిస్తున్నారు.
2004, 2009, 2015, 2020 ఎన్నికల్లో ఇదే పద్ధతి కొనసాగగా... త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మళ్లీ ఉపసర్పంచ్‌గా సర్పంచ్ బాధ్యతలు అందనున్నాయి. మరో వైపు ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఎన్.వీ.బంజర సర్పంచ్ పదవి బీసీ మహిళకు, రాములుతండా సర్పంచ్ పదవిని బీసీ జనరల్‌కు కేటాయించారు. ఈ గ్రామాల్లోనూ బీసీలు లేకపోవడంతో వార్డు సభ్యుల నుంచే ఒకరిని ఉపసర్పంచ్‌గా ఎన్నుకొని, వారికే సర్పంచ్ బాధ్యతలు అప్పగించనున్నారు.
ఆ నాలుగు ఊళ్లలో సర్పంచ్ అభ్యర్థులే లేరు
అమ్రాబాద్, వెలుగు : నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని నాలుగు గ్రామాల్లో సర్పంచ్‌లుగా పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారు. మండలంలోని కల్ములోనిపల్లి, ప్రశాంత్‌నగర్, వంగురోనిపల్లి, కుమ్మరోనిపల్లి గ్రామ సర్పంచ్ స్థానాలను ఎస్టీ మహిళలకు రిజర్వ్ చేశారు. కాగా, ఈ గ్రామాల్లో ఎస్టీ ఫ్యామిలీలే లేకపోవడం గమనార్హం. గత ఎన్నికల్లో సైతం ఇవే రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఐదేళ్లూ ప్రత్యేకాధికారి పాలనే కొనసాగింది.
ఈ సారైనా రిజర్వేషన్లు మారుతాయేమోనని భావించిన గ్రామస్తులకు మరోసారి నిరాశే మిగిలింది. ఈ సారి కూడా ఎస్టీ మహిళకే రిజర్వ్ కావడం.. ఆ కేటగిరిలో ఒక్క ఓటరు కూడా లేకపోవడంతో ఈ సారి కూడా ప్రత్యేకాధికారి పాలన తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నిక జరగకపోవడంతో అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని, ఆఫీసర్లు స్పందించి రిజర్వేషన్లు మార్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.