
మంచిర్యాల జిల్లా: మందమర్రి సింగరేణి ఏరియా ఆధ్వర్యంలో సింగరేణి పాఠశాల మైదానంలో రామ్ లీలా (సప్త వ్యసనాల దిష్టి బొమ్మ దహన కార్యక్రమం) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి సరోజా దంపతులు విచ్చేశారు. ముందుగా వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగింపుగా రామ్ లీలా మైదానానికి మంత్రి వివేక్ మోసుకొచ్చారు. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల ప్రజలు, సింగరేణి కార్మికులు, కార్మిక కుటుంబాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు చేశారు.
దసరా పండుగ సందర్భంగా బెల్లంపల్లి పట్టణం తిలక్ స్టేడియంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రావణ వధ కార్యక్రమంలో కూడా కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సరోజ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. 2012 నుంచి బెల్లంపల్లిలో రావణ వధ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. అందరూ కలిసి మెలిసి ఉండాలని పండగలు మనకు నేర్పిస్తాయని తెలిపారు.
దసరా అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని.. కోపం, ఆక్రోశాన్ని అందరూ చంపుకోవాలని, అప్పుడే ఏదైనా విజయం సాధించవచ్చని హితవు పలికారు. ప్రతి ఒక్కరికీ తోటి వారికి మంచి ఎలా చేయాలనే ఆలోచన ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. అమ్మవారి దయతో రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తుందని, గడ్డం కుటుంబంపై మీ ప్రేమ ఎప్పుడు ఇలాగే కొనసాగాలని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకాంక్షించారు.