ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసిన దగ్గు సిరప్.. టెస్ట్ చేయటానికి తాగిన డాక్టర్ పరిస్థితి..

ఇద్దరు పిల్లల ప్రాణాలు తీసిన దగ్గు సిరప్.. టెస్ట్ చేయటానికి తాగిన డాక్టర్ పరిస్థితి..

రాజస్థాన్‌లో ఒక దగ్గు సిరప్ కారణంగా ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. మరికొందరు పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన అక్కడ తల్లిదండ్రుల్లో గందరగోళనలు రేకెత్తించింది. అయితే తాము ఇచ్చిన దగ్గు మందు సేఫేనని, దాని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని నిరూపించటానికి బయానా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇన్‌చార్జి డా. తారాచంద్ యోగి స్వయంగా సెప్టెంబర్ 24న ఆ సిరప్‌ను పబ్లిక్‌గా తాగారు. అయితే 8 గంటల తర్వాత ఆయన కారు లోపల అపస్మారక స్థితిలో కనబడ్డారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సిరప్ వినియోగంపై పెద్ద ఎత్తున ఆందోళనలు వచ్చాయి. 

సికార్ జిల్లాలోని ఐదేళ్ల బాలుడు సెప్టెంబర్ 30న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వైద్యులు సూచించిన దగ్గు సిరప్ తాగిన గంటల వ్యవధిలోనే మరణించాడు. అయితే దీనికి ముందు సెప్టెంబర్ 22న భరత్పూర్‌లో 2 సంవత్సరాల సమ్రాట్ జాటవ్ కూడా అదే మందు సేవించగా అపస్మారక స్థితిలోకి వెళ్లి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై సమ్రాట్ బామ్మ నెహ్ని జాటవ్ జరిగిన విషయం వెలల్డించారు. తమ ముగ్గురు మనవళ్లకు దగ్గు సిరప్ వేశామని.. ఇద్దరు వాంతులు చేసుకున్నాక తెలివిలోకి రాగా.. సమ్రాట్ మాత్రం మేలుకోలేదని. అతని మృతి తర్వాత దగ్గుమందు దీనికి కారణంగా గుర్తించినట్లు కన్నీటిపర్యంతమైంది. 

బంస్వారా జిల్లాలో కూడా ఒకటినుంచి ఐదేళ్ల మధ్య వయసు గల 8 మంది పిల్లలు అదే దగ్గు సిరప్ తీసుకున్న తర్వాత అనారోగ్యం పాలయ్యారని వైద్యులు ధృవీకరించారు. దీంతో రాజస్థాన్ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టి 22 బ్యాచ్‌ల సిరప్‌పై నిషేధం విధించింది. జూలై నుంచి ఇప్పటివరకు 1.33 లక్షల సీసాలు సరఫరా కాగా వాటిలో 8,200 సీసాలు ఇంకా జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ఆసుపత్రిలో నిల్వలో ఉన్నాయని గుర్తించారు అధికారులు. 

ఈ దగ్గు సిరప్ సరఫరా చేసిన కైసన్ ఫార్మా అనే సంస్థ నుంచి మందుల కొనుగోళ్లను అక్కడి ప్రభుత్వం నిలిపివేసింది. అలాగే వైద్యులు ఇకపై ఆ మందును చిన్నారులకు సూచించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు రాజస్థాన్ డ్రగ్ కంట్రోలర్ అజయ్ పథక్ చెప్పారు. సికార్, ఝుంఝునూ, భరత్పూర్ జిల్లాల నుంచి సిరప్ నమూనాలు సేకరించామని.. టెస్ట్ ఫలితాలు 3 రోజుల్లో వస్తాయని చెప్పారు. పైగా 5 ఏళ్లలోపు పిల్లలకు ఈ సిరప్ ఇవ్వకూడదలని ఆయన అన్నారు.