
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను క్యాన్సిల్ చేయాలంటూ ఇచ్చిన పిలుపు ప్రస్తుతం పెద్ద సునామీగా మారుతోంది. దీని చుట్టూ పెద్ద వివాదం చెలరేగింది. ఈ వివాదానికి కేంద్రబిందువుగా నిలిచిన విషయం Dead End: Paranormal Park అనే యానిమేటెడ్ షో. బ్రిటిష్ రచయిత హమిష్ స్టీల్ సృష్టించిన ఈ సిరీస్ 2022లో ప్రారంభమై 2023లో రద్దు చేయబడింది. ఇందులో ఒక ట్రాన్స్‌జెండర్ పాత్రను చూపించడం వల్ల ఆన్‌లైన్‌లో అనేక విమర్శలు వచ్చాయి.
సెప్టెంబర్ 29న పాపులర్ అకౌంట్ Libs of TikTok ఈ కార్టూన్ పిల్లలకు "ప్రో-ట్రాన్స్‌జెండర్ ఆలోచనలు నింపుతోందని" ఆరోపిస్తూ పోస్ట్ ఒక సంచలన పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ తెగ వైరల్ కావటంతో పాటు కన్సర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ యుటా రాష్ట్రంలో కాల్పుల్లో మరణించడం మరో వాదనకు దారి తీసింది. Libs of TikTok హమిష్ స్టీల్ కిర్క్ మరణాన్ని ఎగతాళి చేశారని ఆరోపించగా.. స్టీల్ మాత్రం దాన్ని పూర్తిగా ఖండించారు. ఈ వివాదంలోకి ఎలాన్ మస్క్ రంగప్రవేశం చేయటంతో మ్యాటర్ ముదిరి పాకాన పడింది.
ఎలాన్ మస్క్ Libs of TikTok పోస్ట్‌ను షేర్ చేస్తూ, "ఇది సరైంది కాదు" అని కామెంట్ చేశారు. అంతేకాక పిల్లల ఆరోగ్యం కోసం నెట్‌ఫ్లిక్స్ అన్‌సబ్‌స్క్రైబ్ చేయమంటూ పిలుపునిచ్చారు. ఒకరు తమ సబ్‌స్క్రిప్షన్ రద్దు చేశామని చెబితే "నేనూ అలాగే చేసాను" అని మస్క్ ఎక్స్ లో దానికి రిప్లై పెట్టారు. దీని తర్వాత తన ఫాలోవర్లకు కూడా మస్క్ అదే సూచించటంతో ఈ మ్యాటర్ పెద్ద సంచలనంగా మారిపోయింది.
విమర్శల తరువాత స్టీల్ తన X అకౌంట్‌ను ప్రైవేట్ చేసుకున్నప్పటికీ.. Blueskyలో స్పందిస్తూ మస్క్ వ్యాఖ్యలను పబ్లిక్ చేశారు. చార్లీ కిర్క్ మరణంపై తాను ఎప్పుడూ ఎగతాళి చేయలేదని, తప్పుడు ఆరోపణలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తెలిపారు. స్టీల్ సృష్టించిన Dead End: Paranormal Parkలో ఇద్దరు టీనేజర్లు, మాట్లాడే ఓ కుక్క దెయ్యాలతో పోరాడుతూ మానవాళిని రక్షించే కథాంశం ఉంటుంది. ఇలాంటి కంటెంట్ చిన్న పిల్లలకు హానికరమని మస్క్ అభిప్రాయపడుతున్నారు.
ప్రజలు సబ్‌స్క్రిప్షన్‌తో ఇలాంటి షోలు చూడనిస్తే, చిన్న వయసులోనే పిల్లల మనసుల్లో గందరగోళమైన సంకేతాలు, భావాలు కలిగే అవకాశం ఉంటుందని అందుకే ఆయన నెట్‌ఫ్లిక్స్ బహిష్కరణకు పిలుపునిచ్చారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. దీంతో మస్క్ అభిమానులు, అలాగే కొందరు తల్లిదండ్రులు ఆయన అభిప్రాయానికి మద్దతు ఇస్తున్నారు. అయితే మరోవైపు ఇది క్రీయేటివ్ స్వేచ్ఛకు విఘాతమని, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను ప్రతినిధ్యం చేయడమే తప్ప దాన్ని "పిల్లలపై దాడి"గా చూపడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.