అమెరికాలో షట్ డౌన్.. వీసా, పాస్పోర్ట్ సేవలపై యూఎస్ ఎంబసీ ఇండియా కీలక ప్రకటన

అమెరికాలో షట్ డౌన్.. వీసా, పాస్పోర్ట్ సేవలపై యూఎస్ ఎంబసీ ఇండియా కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాల ప్రభావం అమెరికా ప్రభుత్వంపై పడింది. డెడ్ లైన్ (బుధవారం) లోపు ఫండింగ్ బిల్లును ఆమోదింపజేసుకోవడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైంది. తమ డిమాండ్లు నెరవేర్చని రిపబ్లికన్ స్టాపేజ్ ఫండింగ్ బిల్లును డెమొక్రాట్లు అడ్డుకోవడంతో అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం షట్ డౌన్ పరిస్థితిని ఎదుర్కొంటోంది. అమెరికాలో తలెత్తిన ఈ షట్ డౌన్ కారణంగా అత్యవసర సేవల మినహా లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల విధులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 7 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులను ఈ షట్ డౌన్ ప్రతికూల పరిస్థితుల్లోకి నెట్టేసింది.

అమెరికాలో ఈ పరిస్థితి తలెత్తడంతో అమెరికా వెళ్లే ప్లాన్స్లో ఉన్న డాలర్ డ్రీమర్స్లో టెన్షన్ నెలకొంది. షెడ్యూల్డ్ పాస్ పోర్ట్, వీసా సేవలపై గందరగోళం నెలకొంది. దీంతో.. ఈ గందరగోళానికి తెరదించుతూ వీసా, పాస్ పోర్ట్ సేవలపై భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా కీలక ప్రకటన చేసింది.

ఈ సమయంలో (షట్ డౌన్ సమయంలో).. పరిస్థితి అనుకూలించినంత వరకు, అమెరికాలో, విదేశాలలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో, కాన్సులేట్స్లో షెడ్యూల్ చేయబడిన పాస్‌పోర్ట్, వీసా సేవలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. రీ షెడ్యూల్ చేసుకోవాల్సిన అవసరం లేదని U.S. Embassy India చెప్పేసింది. అందువల్ల.. వీసా, పాస్ పోర్ట్ సేవలకు సంబంధించి అప్లికెంట్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే.. అత్యవసర సమాచారం మినహా షట్ డౌన్ పరిస్థితి నుంచి అమెరికా బయటపడేంత వరకూ తమ ‘ఎక్స్’ ఖాతాను అప్డేట్ చేసే పరిస్థితి లేదని..  U.S. Embassy India సేవల కోసం http://travel.state.gov. వెబ్ సైట్ను సందర్శించాలని యూఎస్ ఎంబసీ ఇండియా తెలిపింది.