దేశ సాంస్కృతిక సంపద పురాతన కట్టడాలు

దేశ సాంస్కృతిక సంపద పురాతన కట్టడాలు

దేశచరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, పరిపాలనను  ప్రతిబింబించే ‘పురాతన కట్టడాలు’ ప్రపంచ వ్యాప్తంగా అనేకం ఉన్నాయి. ఐక్యరాజ్య సమితికి చెందిన ‘యునెస్కో’ ఆధ్వర్యంలో ‘ప్రపంచ వారసత్వ ప్రదేశాల’ గుర్తింపు,  నిర్వహణ  జరుగుతోంది.  ప్రపంచ దేశాల వారసత్వ సంపద పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ పురాతన కట్టడాలు స్థలాల పరిరక్షణ సంఘం  సంయుక్తంగా ఆఫ్రికా లోని ‘ట్యునీషియా’లో 1982  ఏప్రిల్ 18న సమావేశం నిర్వహించాయి. ఆ రోజును ప్రతి ఏటా ‘ప్రపంచ వారసత్వ దినోత్సవం’గా జరుపుకుంటారు. 

ఈ సంవత్సరం  ‘discover and experience diversity’అనే థీమ్​తో  ఈ కార్యక్రమం జరగనుంది. యునెస్కో మానవాళికి అత్యుత్తమ విలువగా పరిగణించే విలక్షణమైన సాంస్కృతిక లేదా భౌతిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశాలను గుర్తించి, వాటిని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చుతోంది.  ముఖ్యంగా వివిధ దేశాల వైవిధ్యమైన అడవులు, పర్వతాలు, సరస్సులు, ఎడారులు, కట్టడాలు, నగరాలను, యునెస్కో  ప్రపంచ వారసత్వ  ప్రదేశాల జాబితాలో చేరుస్తున్నది.  ఒక దేశ సాంస్కృతిక సంపదను పరిరక్షిస్తూ ఆ దేశ వారసత్వాన్ని భావితరాలకు అందించడమే దీని ముఖ్య ఉద్దేశం.

 ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా యునెస్కో వారసత్వ ప్రదేశాలలో 993 సాంస్కృతిక,  227 సహజ సిద్ధ,  39 మిశ్రమ స్థలాలను గుర్తించింది. వీటిలో 42 భారత్​లో ఉన్నాయి.  ప్రపంచ వారసత్వ ప్రదేశాలు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్​ ఆరవ స్థానంలో ఉంది. భారతదేశంలో పురాతన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే వారసత్వ ప్రదేశాలు అనేకం ఉన్నాయి. సింధు నాగరికత,  బౌద్ధ, అశోకుని కాలం నుంచి మొదటగా చారిత్రక నిర్మాణాలు, శిల్పకళా సంపద ఆరంభమైనది.  రాజుల శిలా శాసనాలు, గుహలు, దేవాలయాలు, కోటలు వంటి కట్టడాలు మన చారిత్రక వారసత్వ సంపదకు గొప్ప నిదర్శనాలు. 2021లో గుజరాత్ లోని  దోలవీరా దేవాలయం,  తెలంగాణలోని  రామప్ప దేవాలయానికి  ప్రపంచ వారసత్వ హోదా రావడం జరిగింది.  గతేడాది రవీంద్రనాథుని శాంతినికేతన్, కర్నాటకలోని హొయసాల దేవాలయం కూడా యునెస్కో జాబితాలో చేరింది. 

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు 

భారతదేశంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలైన తాజ్ మహల్, అజంతా, ఎల్లోరా గుహలు, హంపి, కోణార్క్ సూర్య దేవాలయం, పశ్చిమ కనుమలు, ఎర్ర కోట, కజిరంగా అభయారణ్యం, కాంచన జంగ జాతీయ పార్కు లాంటివి పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తున్నాయి.  ఈ క్రమంలో  తెలంగాణలోని  రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందడం మనకు గర్వకారణం.  ఇది ఆనాటి కాకతీయుల  వాస్తు, శిల్పరీతికి తలమానికం.  నేడు భారతీయ చరిత్ర,  సంస్కతీ సంప్రదాయాలకు,  కళా వైభవానికి పట్టుగొమ్మలుగా నిలుస్తున్న పురాతన కట్టడాలు వివిధ కారణాలతో  కళావైభవాన్ని కోల్పోతున్నాయి. ఆగ్రాలోని పాలరాతితో నిర్మించిన తాజ్ మహల్ కు 'నిర్లక్ష్యం, - కాలుష్యం' కలగలిసి ఈ అద్భుత నిర్మాణం మనుగడకే ముప్పుగా మారాయి. 

పేదలు వీక్షించేలా ప్రభుత్వాలు సహకరించాలి

మన రాజ్యాంగంలో సైతం ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలలో ‘వారసత్వ సంపద పరిరక్షణ’ అంతర్భాగంగా ఉంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం వారసత్వ ప్రదేశాలను పర్యాటక కేంద్రాలుగా ప్రకటించి ఆర్థిక వనరుగా మార్చే ప్రయత్నం చేస్తున్నది. వారసత్వ కట్టడాల అభివృద్ధికి  కేంద్ర ప్రభుత్వం 2015లో ‘హృదయ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.  గతేడాది  దత్తత విధానంలో వాటి అభివృద్ధికి  ‘అడాప్ట్ ఎ హెరిటేజ్ 2.0’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ,  ప్రైవేట్ భాగస్వామ్యంతో స్మారక కట్టడాల అభివృద్ధికి కృషి చేయనున్నారు. మన పురాతన చారిత్రక కట్టడాలను దేశీయంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు వీక్షించే అవకాశం లేకుండా పోతున్నది.  ప్రయాణం, వసతి ఖర్చులు భారీగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.  కాబట్టి,  ప్రభుత్వాలు పథకాల ద్వారా స్మారక కట్టడాలను పేద ప్రజలు ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించాలి. 

- సంపతి రమేష్ మహరాజ్, సోషల్​ ఎనలిస్ట్

  • Beta
Beta feature
  • Beta
Beta feature