సంక్షోభంలో ఉన్న ప్రపంచాన్ని బలోపేతం చేయాలి : ప్రధాని మోడీ

సంక్షోభంలో ఉన్న ప్రపంచాన్ని బలోపేతం చేయాలి : ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం ప్రస్తుతం సంక్షోభ పరిస్థితుల్లో ఉందని, తిరిగి శక్తివంతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అసమానతలను తొలగించేలా, అవకాశాలను పెంచేలా అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక విధానాన్ని రీడిజైన్ చేసేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. వర్చువల్‌‌గా నిర్వహిస్తున్న రెండు రోజుల ‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్‌‌’లో ప్రధాని మాట్లాడారు. కరోనా, ఉక్రెయిన్---–రష్యా యుద్ధం, టెర్రరిజం, వాతావరణ మార్పుల వల్ల ఆహార, ఇంధన భద్రతా సవాళ్లు ఎదురవుతున్నాయని, అభివృద్ధి చెందుతున్న దేశాలకు వీటితో సంబంధం లేకున్నా ప్రభావం మాత్రం వాటిపై పడుతోందన్నారు. ‘‘యుద్ధం, టెర్రరిజం, పెరుగుతున్న ధరలు, విపత్తులు, కరోనా చూపెట్టిన ఆర్థిక ప్రభావాలు.. వంటివాటితో ప్రపంచం సంక్షోభంలో ఉందన్నది స్పష్టం. ఈ అస్థిరత ఎంతకాలం ఉంటుందో అంచనా వేయలేం. అందుకే ప్రపంచాన్ని తిరిగి శక్తివంతం చేయాల్సిన అవసరం ఉంది” అని చెప్పారు.

అంతర్జాతీయ అజెండా అవసరం

సవాళ్లను ఎదుర్కొనేందుకు ‘స్పందించు, గుర్తించు, గౌరవించు, సంస్కరించు’ అనే అంతర్జాతీయ అజెండా అవసరమని ప్రధాని చెప్పారు. ‘‘అందరినీ కలుపుకునిపోయే, సమతూకంగా ఉండే అంతర్జాతీయ అజెండా కావాలన్నారు. ‘కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ సూత్రం ప్రపంచ సవాళ్లకు వర్తిస్తుందని గుర్తించాలన్నారు. అన్ని దేశాల రూల్ ఆఫ్ లాను  గౌరవించాలని, వివాదాలను పరిష్కరించుకోవాలని, ఇందుకు యూఎన్ వంటి సంస్థలను సంస్కరించుకోవాలని వివరించారు. 

మీ ప్రాధాన్యతలే మా ప్రాధాన్యతలు

సమిట్‌‌లో బంగ్లాదేశ్, థాయ్‌‌ల్యాండ్, ఉజ్బెకిస్తాన్, వియత్నాం, కాంబోడియా, గయానా, మొజాంబీ, మంగోలియా, సెనెగల్ తదితర దేశాల నేతలు పాల్గొన్నారు. ఆసియా, ఆఫ్రికా, సౌత్ అమెరికాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలను ‘గ్లోబల్ సౌత్‌‌’గా భావిస్తారు. ‘‘ఇండియాకు సంబంధించినంత వరకు.. మీ గొంతుకే ఇండియా గొంతుక. మీ ప్రాధాన్యతలే ఇండియా ప్రాధాన్యతలు” అని ఆయా దేశాలను ఉద్దేశిస్తూ ప్రధాని అన్నారు.