ఈ రోడ్డుపై ప్రయాణం కాస్త అటు ఇటైనా.. ఇక అంతే..

ఈ రోడ్డుపై  ప్రయాణం కాస్త అటు ఇటైనా.. ఇక అంతే..

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రహదారి బొలీవియాలో ఉంది. పశ్చిమ బొలీవియాలోని ఎత్తైన నగరమైన లా పాజ్ నుండి యుంగాస్ వ్యాలీకి, ఆ తర్వాత అమెజాన్ పర్వత ప్రాంతాలకు వెళ్లే రోడ్డు ఏటవాలుగా ఉంటుంది. దీనిని  డెత్ రోడ్ అని  పిలుస్తారు. ఈ రహదారిలో ప్రతి ఏడాది 200 నుండి 300 మంది మరణిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రహదారిగా గుర్తింపు పొందింది.   దాదాపు 70 కిలోమీటర్లు  మేర  ఈ రహదారిపై కొండచరియలు విరిగిపడడం, పొగమంచు, శిథిలమైన పర్వతాలు ఏర్పడే ప్రమాదం ఉంది. చాలాచోట్ల ఈ రోడ్డు వెడల్పు మూడు మీటర్లు కూడా ఉండదు. దీనికి చాలా మలుపులు, అంచులు ఉన్నాయి. చిన్న చిన్న జలపాతాలు రోడ్డు పక్కన రాళ్ల మీద నుండి జాలు వారుతుంటాయి.  ఈ దారిలో 3,500 మీటర్ల వాలు రోడ్డు కూడా ఉంది.

1930 లో రోడ్డు నిర్మాణం 

ఈ రహదారిని 1930 లో పరాగ్వే - బ్రెజిల్  మధ్య జరిగిన చాకో యుద్ధంలో...  బందీలుగా ఉన్న పరాగ్వే (1864-70), చాకో (1932-35) యుద్ద ఖైదీలు నిర్మించారు. ఈ రహదారి బొలీవియా రాజధాని లా పాజ్‌ను కొరోయికో నగరంతో కలుపుతుంది. 2006  వరకు ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించడానికి రహదారిగా మాత్రమే ఉండేది. కానీ 2009 లో ప్రభుత్వం మరొక రహదారిని నిర్మించింది. ఈ రహదారిలో కూడా చాలా భద్రతా ఏర్పాట్లు చేశారు. రోడ్డుకిరువైపులా దట్టమైన అడవులు, పర్వతాలు, రాళ్లు కనిపిస్తున్నాయి.  రోడ్డు పక్కన అక్కడక్కడ తెల్లటి శిలువ గుర్తులతోపాటు, రకరకాల పువ్వులు కూడా కనిపిస్తాయి.

ప్రపంచ ప్రమాదకరమైన రహదారి

1995లో ఇంటర్- అమెరికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ దీనిని 'ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన రహదారి అని పేర్కొంది. రోడ్డు  వెడల్పుగా లేకపోవడం..  వర్షాకాలంలో  జారుతూ ఉండేది. 2000 అడుగుల నుంచి 15 వేల అడుగుల ఎత్తులో ప్రమాదం జరిగినప్పుడు వాహనాలు నేరుగా కాలువలో పడతాయి. ఈ రోడ్డులో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో ఒక బైపాస్‌ను నిర్మించినప్పటికీ, ఈ రహదారికి ఉన్న పేరు కారణంగా చాలామంది పర్యాటకులు ఈ రోడ్డు మీదనే ప్రయాణించడానికి మొగ్గు చూపుతారు.ఇది ప్రపంచంలోనే అత్యంత అధ్వాన్నమైన రహదారిగా పరిగణించబడింది.